AP CID: అలాంటి పోస్టులు పెడితే ఉరుకోం.. ఏపీ సీఐడీ హెచ్చరికలు
సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఏపీ సీఐడీ హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ బాస్ సంజయ్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి మరింత అవగాహన కల్పించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులపైన అనుచిత పోస్టులు పెడుతున్న విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. సీఎం జగన్ కుటుంబంపై అనుచిత పోస్టులు పెట్టేవారిని గుర్తించామని, వారిపై నిఘా పెట్టామని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ప్రతిపక్ష నేతలపై ఉన్న అనుచిత పోస్టులను తొలగించామని, ఫేక్ అకౌంట్స్‌ను నడిపేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి వారిని ప్రోత్సహించే వారిపైనా తీవ్ర చర్యలుంటాయన్నారు.
ఫేక్ అకౌంట్స్ తీసినా సరే పట్టుకుంటాం : సంజయ్
టీడీపీ కార్తీక్ రెడ్డి, సమర సింహా రెడ్డి, చిత్రలహరి, వైసీపీ మొగుడు లాంటి అకౌంట్ల నుంచి అసభ్య కరమైన పోస్టులు పెట్టే వారి ఆస్తులు జప్తు చేయడానికి సీఐడీ రెడీగా ఉందన్నారు. సోషల్ మీడియాలో జడ్జిలపైనా అనుచితంగా పోస్టులు పెట్టేవారికి నోటీసులు ఇస్తామన్నారు. ఎక్కడ నుంచి పోస్టులు పెట్టినా పట్టుకుంటామన్నారు. ఫేక్ అకౌంట్స్‌తో పోస్టులు పెడితే గుర్తించలేమనుకోకూడదన్నారు. సాంకేతికతతో వాటిని నిలువరిస్తామన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాను పాజిటివ్ విషయాలపైనా, మంచి వాటికోసం వాడుకోవాలని హితవు పలికారు. ఒకదశలో హైకోర్టు న్యాయమూర్తులపైనా విపరీత పోస్టులు పెడుతున్నారన్న సంజయ్, మహిళా జడ్జిపై అనుచిత వ్యాఖ్యలపైనా దృష్టి సారించామన్నారు.