
Chandrababu: వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా, కొందరు అధికారుల తీరుతో ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. ముఖ్యంగా పెన్షన్ పంపిణీ విషయంలో కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయని, అటువంటి అధికారులు తమ విధి నిర్వహణ తీరు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో కూడా అధికారులు మరింత వేగంగా పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజల సమస్యలను ఓపికగా విని, సేవాభావంతో విధులు నిర్వర్తించాలన్నారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటూ, సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు.
వివరాలు
వినియోగదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా సేవలు
వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వారం రోజుల వ్యవధిలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2.64 లక్షల లావాదేవీలు జరిగినట్టు తెలిపారు. త్వరలో టీటీడీ, రైల్వే సేవలను కూడా వాట్సాప్ గవర్నెన్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. వినియోగదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా సేవలు ఉండాలని సూచించారు. ప్రజలు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని శాఖలు తమ సర్వర్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీశైలం సహా అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.