AP CM Chandrababu: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీగా అమరావతి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీగా మారుస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అధికారులను ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ,సీఆర్డీయే అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఈ అంశాన్ని చర్చించారు. అమరావతి లోగో డిజైన్ ఆంగ్లంలో మొదటి అక్షరం 'A', చివరి అక్షరం 'I' కలిసేలా, ఏఐ సిటీగా గుర్తింపు పొందేలా ఉండాలని కోరారు. రాజధాని నిర్మాణం ఎక్కడ చూసినా సాంకేతిక ప్రగతిని ప్రతిబింబించేలా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం అమరావతి పట్ల వ్యవహరించిన తీరుతో రాజధాని పనులు నిలిచిపోయాయని, ఇప్పుడు వాటిని వేగంగా పునరుద్ధరించాలని చెప్పారు.
హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపై సమీక్ష
అధికారులకు టెండర్లు పిలవడం,ప్రభుత్వ భవనాల నిర్మాణానికి పట్టే సమయం,చేపట్టిన పనులను సమీక్షించారు. సీఆర్డీయే కార్యాలయం నిర్మాణం 90 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.అధునాతన టెక్నాలజీని ఉపయోగించి నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా నిర్మాణం జరగాలన్నారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపై కూడా సీఎం సమీక్షించారు.ఈప్రాజెక్టును 2019లో వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని,దీని వలన సీఆర్డీఏకు భారీ నష్టం వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నష్టాన్ని పూడ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని,ప్రాజెక్టును పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. రాజధానిలో ఇంకా 3,558ఎకరాలు సేకరించాల్సి ఉందని,రెండు గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అదేవిధంగా,రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు 60% పూర్తయ్యాయని,ఈ పనులను డ్రోన్ల సాయంతో పర్యవేక్షించాలన్నారు. విశాఖపట్టణం,విజయవాడల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు.