ఆంధ్రప్రదేశ్: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్; కొత్తగా పెన్షన్, రేషన్ కార్డుల జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. కొత్త పెన్షన్ కార్డులు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీకార్డులను మంజూరు చేశారు. అలాగే వివిధ కారణాలతో సంక్షేమ పథకాల బకాయిలను అందుకోలేకపోయిన అర్హుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. ఈ మేరకు గురువారం క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం బటన్ నొక్కగా, నిధులు ఆయా ఖాతాల్లోకి వచ్చి చేరాయి. 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి 2,62,169 మంది అర్హులకు రూ.216.34 కోట్లను పంపిణీ చేశారు. ఇదే సమయంలో కొత్తగా అర్హత సాధించిన మరో 1,49,875 మందికి పెన్షన్లను మంజూరు చేశారు.
మంచి చేసేందుకు 4 అడుగులు ముందుకేసే బాధ్యత నాదే : వైఎస్ జగన్
కొత్తగా 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, నూతనంగా 2,00,312 మందికి రేషన్ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలను అందించారు. దీంతో పెన్షన్ల సంఖ్య మొత్తం 64 లక్షల 27 వేలకు చేరుకుంది. గత సర్కారు హయాంలో రూ.1000 ఉన్న పెన్షన్ ప్రస్తుతం రూ.2750కి పెరిగింది. జగనన్న చేదోడు ద్వారా 43,131 మందికి సాయం అందింది. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. కారణం ఏదైనా పథకాల్లో లబ్ధి పొందని వారికీ ప్రత్యేకంగా నిధులను అందజేస్తున్నామన్నారు. అధికారమంటే అజమాయిషీ కాదని, ప్రజల పట్ల మమకారం చూపించడమన్నారు. ప్రజలకు మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందేకేసే బాధ్యత తనదేనని ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు.