రేపటి చలో విజయవాడ మహాధర్నా వాయిదా.. అనుమతి రాకపోవడమే కారణమన్న విద్యుత్ జేఏసీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రేపటి 'చలో విజయవాడ' కార్యక్రమం వాయిదా పడింది.
విద్యుత్ ఉద్యోగులకు మెరుగైన వేతన సవరణ కావాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఆ సంఘం పట్టుబట్టింది.
అయితే ఈ అంశంపై ఆగస్ట్ 17న విద్యుత్ సౌధ వద్ద తలపెట్టదల్చిన మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేశారు.
ఈ మేరకు విద్యుత్ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సుబ్బిరెడ్డి ప్రకటించారు.
ధర్నాకు అనుమతి రాకపోవడం వల్లే వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు ధర్నాకు అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నామన్నారు.
ఈ నేపథ్యంలోనే ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు వివరించారు.
DETAILS
కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేసి పీఆర్సీ అమలు చేయాలి: విద్యుత్ స్ట్రగుల్ కమిటీ
ఏపీ హైకోర్టు తీర్పు ఉద్యోగులకు అనుకూలంగానే ఉంటుందని విద్యుత్ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది.
అనంతరం మహాధర్నా యథావిధిగా చేపడతామని కమిటీ ప్రధాన కార్యదర్శి సుబ్బిరెడ్డి అన్నారు.
మహాధర్నాకు పర్మిషన్ వచ్చాకే మరో తేదీని ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకూ కనీసం 23 శాతం ఫిట్‌మెంట్ మంజూరు చేయాలని విద్యుత్ ఉద్యోగుల తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
విద్యుత్ ఉద్యోగులకు ప్రకటించిన 8 శాతం ఫిట్‌మెంట్‌ను స్ట్రగుల్ కమిటీ వ్యతిరేకిస్తుందని సుబ్బిరెడ్డి చెప్పుకొచ్చారు.
మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, 2022 పీఆర్సీ(PRC) మేరకు వారికి జీతాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలే ఆయా కార్మికులకు నేరుగా వేతనాలు అందించాలన్నారు.