AP Free Gas Cylinder Scheme: ఏపీలోఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీం.. అర్హతలేంటి? ఏయే పత్రాలు కావాలి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో వేగంగా దూసుకుపోతోంది. ఎన్నికల సమయంలో తెలుగుదేశం,జనసేన, బీజేపీ కూటమి 'సూపర్ 6' పేరుతో ప్రజలకు పలు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రజా మద్దతుతో అధికారంలోకి రావడంతో, ఆ హామీల అమలుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై కీలక ప్రకటన చేశారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై వివరణ
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేద,మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారం తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల వేళ ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీపావళి పండుగ రోజున ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ మహాశక్తి పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పొందుపరచబడింది. 'సూపర్ 6' హామీల అమలులో ఇది తొలి అడుగు.ప్రతి పేద,మధ్య తరగతి కుటుంబానికి ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయనుంది కూటమి ప్రభుత్వం. ఈ పథకం లబ్ధిదారులుగా తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఉండవచ్చు.మహిళల పేరిట సిలిండర్లు పంపిణీ చేయనున్నారు. దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
కూటమి ఎన్నికల హామీలు
'దీపం' పథకంలో భాగంగా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు. చదువుకునే పిల్లల తల్లులకు సంవత్సరానికి రూ. 15,000 ఆర్థిక సాయం. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు రూ. 1,500 ఆర్థిక సహాయం. మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. యువగళం పథకంలో 20 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు, నెలకు రూ. 3,000 నిరుద్యోగ భృతి. రైతులకు సంవత్సరానికి రూ. 20,000 పెట్టుబడి సాయం. ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా చేయడానికి కుళాయి ఏర్పాటు. బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం.
దీపావళి నుండే హామీల అమలు ప్రారంభం
దీపావళి పండుగ నుంచి సంక్షేమ పథకాల అమలు ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశం మంగళగిరిలో నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు. సమావేశంలో 'ఇది మంచి ప్రభుత్వం' అనే పోస్టర్ విడుదల చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో ప్రారంభించి, ఒక్కొక్కటిగా అన్ని హామీలను అమలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు.