Page Loader
AP Journalists: జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇళ్లస్థలాలు ఇవ్వాల‌ని సీఎం ఆదేశాలు..
జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇళ్లస్థలాలు ఇవ్వాల‌ని సీఎం ఆదేశాలు..

AP Journalists: జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇళ్లస్థలాలు ఇవ్వాల‌ని సీఎం ఆదేశాలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జర్నలిస్టులకు సానుకూల సంకేతాలు పంపింది. రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు రెవెన్యూశాఖపై ఇవాళ నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులను కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ లక్ష్యంతో ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, పొంగూరు నారాయణలు ఈ ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు. త్వరలోనే, ఈ మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమై జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై విధివిధానాలను రూపొందించనుంది. ఆ విధివిధానాలను ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం, తుదితీర్మానం తీసుకోనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

రెవెన్యూశాఖపై సమీక్ష - భూముల సర్వే, పాస్‌బుక్స్‌ పంపిణీపై స్పష్టత 

ఈ సందర్భంగా రెవెన్యూశాఖ పనితీరు, భూ సంబంధిత సమస్యల పరిష్కారంపై కూడా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పలు కీలక విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో భూముల పునః సర్వే పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని, ప్రజల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ఈ ప్రక్రియ సాగుతోందని తెలిపారు. అగస్టు 15వ తేదీన కొత్త పాస్‌బుక్స్‌ను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రెవెన్యూ సదస్సులో 4 లక్షలకుపైగా సమస్యలు వచ్చినట్లు చెప్పారు. వాటిలో అభ్యంతరం లేని భూములకు సంబంధించిన సమస్యలు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 30 ద్వారా రెగ్యులరైజేషన్ చేయనున్నట్లు తెలిపారు.

వివరాలు 

సుపరిపాలనలో కీలక అడుగులు - గృహ నిర్మాణంపై దృష్టి 

"సుపరిపాలన - తొలి అడుగు" కార్యక్రమం క్రమబద్ధీకరణకు దోహదపడేలా ఉంటుందని మంత్రి వివరించారు. అందులో భాగంగా "హౌసింగ్ ఫర్ ఆల్" లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పేదల కోసం రెండేళ్లలోపు ఇళ్ల స్థలాలు, మూడేళ్లలోపు ఇళ్లు కట్టించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. పేదలతో పాటు జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా మంత్రివర్యులు స్పష్టం చేశారు.