LOADING...
Andhra Pradesh: సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

Andhra Pradesh: సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2025
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియాలో నియంత్రణ లేకుండా కొనసాగుతున్న తప్పుడు ప్రచారాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతోంది. ఈ దిశగా కఠిన చట్టాలను అమలు చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే ఈ అంశంపై పరిశీలన కోసం కేబినెట్ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయగా,ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో కూడా దీనిపై ప్రధానంగా చర్చ జరిగింది. ఫేక్ పోస్టులు పెట్టినా,అసత్య ప్రచారాలు చేసినా తప్పనిసరిగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే బహిరంగంగా హెచ్చరించారు. తప్పుడు ప్రచారంపై ప్రత్యర్థి పార్టీకి హెచ్చరికలు జారీ చేసిన ముఖ్యమంత్రి.. ఈ అంశంపై కేబినెట్‌ భేటీలో కూడా చర్చించారు. సోషల్ మీడియా పోస్టులకూ ఒక విధమైన ఆధార్ తరహా అకౌంటబిలిటీ ఉండేలా చూడాలని సూచించారు.

వివరాలు 

అసత్య ప్రచారాన్ని నియంత్రించాలని చాలాకాలంగా డిమాండ్ 

ప్రస్తుతం ఎవరికీ బాధ్యత లేకుండా ఎవరైనా సోషల్ మీడియాలో ఏమి కావాలంటే అది పోస్టు చేస్తున్నారు. నిజమా అబద్ధమా అన్నది ప్రజలు గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసత్య ప్రచారాన్ని నియంత్రించాలని చాలాకాలంగా డిమాండ్ వినిపిస్తోంది. దానిని దృష్టిలో పెట్టుకుని ఇకపై సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను సమగ్రంగా రివ్యూ చేసే విధానాన్ని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. వ్యక్తిగత విమర్శలు చేసినా, అబద్ధపు ప్రచారాన్ని ప్రోత్సహించినా, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పోలీసులు సోషల్ మీడియా పోస్టులను ప్రత్యేకంగా గమనిస్తున్నారు. ఎవరు పోస్టులు పెడితే, వాటికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరుతున్నారు.

వివరాలు 

యూరియా సరఫరాపై  దుష్ప్రచారం 

ఆధారాలు లేకపోతే ఆయా పోస్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఫేక్ అకౌంట్లపై చెక్ పెట్టేందుకు సోషల్ మీడియా ఖాతాలను ఆధార్‌లాంటి ఐడీలతో లింక్ చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే సోషల్ మీడియా నియంత్రణ కోసం ఏర్పాటైన కేబినెట్ సబ్‌ కమిటీకి కూడా బాధ్యతలు అప్పగించబడ్డాయి. మరోవైపు యూరియా సరఫరాపై జరుగుతున్న దుష్ప్రచారం విషయాన్ని కూడా ముఖ్యమంత్రి కేబినెట్‌లో ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేకపోయినా,ప్రతిపక్ష వైసీపీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ అబద్ధపు ప్రచారాన్ని ఎదుర్కోవడంలో మంత్రులు,పార్టీ నాయకులు తగిన స్థాయిలో ప్రతిస్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి ప్రచారాలపై మరింత అప్రమత్తంగా ఉండాలని,తప్పుడు సమాచారాన్ని వెంటనే ఖండించాలని స్పష్టంగా సూచించారు.