ఏపీ హైకోర్టులో ముగిసిన విచారణ.. 'లోకేశ్'ను అరెస్ట్ చేయట్లేదని ట్విస్ట్ ఇచ్చిన ఏజీ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. తొలుత వాదనలు వినిపించిన ఏజీ, తాము లోకేశ్ ను అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. దీంతో విచారణ ముగిస్తున్నట్లు హైకోర్టు తీర్పు వెలువరించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ-14గా ఉన్న నారా లోకేశ్ యాంటిసిపేటరీ బెయిల్ (ముందస్తు బెయిల్) పిటిషన్ పై విచారణ జరిపింది.
CRPC 41-A కింద నోటీసులు ఇచ్చి విచారిస్తాం : ఏజీ
లోకేశ్ పై ఎఫ్ఐఆర్ (FIR)లో దర్యాప్తు అధికారి మార్పులు చేశారని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయనకు 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామన్నారు. దర్యాప్తునకు లోకేశ్ సహకరించకపోతే, సదరు విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. అనంతరం అరెస్ట్ చేస్తామని వివరించారు. ఈ క్రమంలోనే 41-ఏ నిబంధనలను పూర్తిగా పాటిస్తామని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు లోకేశ్ అరెస్ట్ పై ఆందోళన లేనందు వల్ల విచారణను ముగిస్తున్నట్లు చెప్పింది. అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించినట్టు న్యాయ నిపుణులు పేర్కొనడం గమనార్హం.