Bathroom Photo App: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్..ఇక నుండి మరుగుదొడ్ల ఫొటోలు అప్‌లోడ్ చేయాల్సిన పని లేదు
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద బాత్రూమ్ ఫోటో యాప్‌కు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారికంగా ముగింపు పలికింది. పాఠశాలల బాత్‌రూమ్‌ల పరిశుభ్రతను ప్రదర్శించేందుకు ఉపాధ్యాయులు రోజూ పాఠశాల బాత్‌రూమ్‌ల చిత్రాలను చిత్రీకరించి అప్‌లోడ్ చేయాల్సిన యాప్‌ను తొలగిస్తున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. కొత్త నిర్ణయంతో,టీడీపీ ప్రభుత్వం విద్యావేత్తల మనోభావాలను గుర్తించి, యాప్‌ను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది. అప్పట్లోఈ యాప్ అమలుపై ఉపాధ్యాయులు ఆందోళనలు చేసినా,గత ప్రభుత్వం స్పందించలేదు. యాప్‌ను రద్దు చేయడం ద్వారా..ఉపాధ్యాయుల గౌరవానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం పట్ల నోబుల్ టీచర్స్ అసోసియేషన్‌కు చెందిన ప్రధాన కార్యదర్శులు ఎస్.చిరంజీవితోపాటు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) అధ్యక్షుడు జి.హృదయరాజు, నాయకులు ఎన్.వెంకటరావు, బి.హైమారావు కృతజ్ఞతలు తెలిపారు.