LOADING...
Pinnelli Brothers : పిన్నెల్లి సోదరులకు ఏపీ హైకోర్టులో దక్కని ఊరట.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన న్యాయస్థానం 
ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన న్యాయస్థానం

Pinnelli Brothers : పిన్నెల్లి సోదరులకు ఏపీ హైకోర్టులో దక్కని ఊరట.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన న్యాయస్థానం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెదేపా నేతల హత్యల కేసులో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో వారు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు తిరస్కరించింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెదేపా నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు,జవిశెట్టి కోటేశ్వరరావు హత్యలో పిన్నెల్లి సోదరులకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. మృతుల బంధువు తోట ఆంజనేయులు ఫిర్యాదు ఆధారంగా నిందితులపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.

వివరాలు 

రెస్టారెంట్‌లో సమావేశమై హత్యకు కుట్ర

ఏ1గా జవిశెట్టి శ్రీను ఎలియాస్‌ బొబ్బిలి, ఏ2గా తోట వెంకట్రామయ్య, ఏ3గా తోట గురవయ్య, ఏ4గా దొంగరి నాగరాజు, ఏ5గా తోట వెంకటేశ్వర్లు, ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను పేర్కొన్నారు. పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపిస్తూ, జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్యలో పిన్నెల్లి సోదరుల పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నట్లు తెలిపారు. వాదనలో, హత్య వెనుక పిటిషనర్ల కుట్ర, ప్రోద్బలం ఉన్నట్లు, నిందితులు ఒక రెస్టారెంట్‌లో సమావేశమై హత్యకు కుట్రపన్నారని వెల్లడించారు.

వివరాలు 

సాంకేతిక, ఫోన్‌కాల్‌ రికార్డు ఆధారాలు

అలాగే, హత్యలో పాల్గొన్న వ్యక్తులతో పిన్నెల్లి సోదరులు ఫోన్‌లో సంప్రదించారని, దీనికి ఫోన్ కాల్ రికార్డులు వంటి సాంకేతిక ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మొదటి నిందితుడికి పిటిషనర్లు సర్పంచ్ పదవికి పోటీ చేస్తే మద్దతిస్తామని హామీ ఇచ్చారని కూడా వాదనలో వివరించారు. ఈ వాస్తవాలను వెలికితీయాలంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఏ6) వెంకట్రామిరెడ్డి (ఏ7)ను కస్టడీకి తీసుకొని విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని పోలీసుల తరఫున హైకోర్టుకు వివరించారు. హైకోర్టు, ఆగస్టు 21న జరిగిన విచారణలో ఇరువైపుల వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ప్రకటించారు. తరువాత, హైకోర్టు పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.