Ap Government : ఆంధ్రప్రదేశ్ సర్కారుకు హైకోర్టు షాక్.. విశాఖకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖకు ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలను తరలించాలనుకున్న ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ మేరకు కార్యాలయాల తరలింపు ప్రక్రియకు కోర్టు బ్రేకులు వేసింది. ఈ క్రమంలోనే కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధిస్తూ ఆదేశాలిచ్చింది. అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపును సవాల్ చేస్తూ రైతులు వేసిన పిటీషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
కేసు త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ
ఈ పిటీషన్‌ను ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి పంపిస్తామని ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇప్పటికే విచారణ పెండింగ్‌లో ఉందని, ఈలోగా పిటీషన్ వేసిన రైతుల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగానే రాజధాని కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో తాము ప్రభుత్వం నుంచి ఆదేశాలు విడుదల చేయిస్తామని ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. దీంతో. తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ఇవాళ మరోసారి విచారణ జరిపిన హైకోర్టు, కేసు త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది. సదరు ధర్మాసనం తీర్పు వచ్చే వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో ఉత్తర్వులను రిలీజ్ చేసింది.