AP Liquor Bar Auctions : ఏపీలో 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ మద్యం పాలసీ అమల్లో ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ తాజాగా 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 17 నుంచి ప్రారంభమై ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ దరఖాస్తులను డిసెంబర్ 23న పరిశీలించి, డిసెంబర్ 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేలం నిర్వహిస్తారు. వేలం ప్రక్రియలో విజయం సాధించిన వారికి ఎక్సైజ్ అధికారులు లైసెన్సులు జారీ చేస్తారు.
53 బార్లకు వేలం ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల
గతంలో ఒకసారి 53 బార్లకు వేలం ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల చేశారు, కానీ ప్రభుత్వం ఆ ప్రక్రియను రద్దు చేసి తాజాగా రీనోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ బార్లకు లైసెన్స్ గడువు 2025 ఆగస్టు వరకు కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. గత పాలసీ ప్రకారం, దరఖాస్తు ఫీజులు జనాభాపై ఆధారపడి ఉంటాయి. 50,000 జనాభా వరకు ఉన్న ప్రాంతాల్లో దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలు, 50,000 నుంచి 5 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.7.5 లక్షలు కాగా, 5 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.10 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఫీజు నాన్ రిఫండబుల్.
ఐదేళ్లకు ఒకేసారి లైసెన్సులు జారీ
అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రీమియం లిక్కర్ స్టోర్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వబడింది. ఎక్సైజ్ శాఖ ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, మొత్తం 12 ప్రీమియం స్టోర్లను మున్సిపల్ కార్పొరేషన్లు, ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టోర్ల దరఖాస్తు ఫీజు రూ.15 లక్షలుగా నిర్ణయించబడింది. లైసెన్స్ ఫీజు ఏడాదికి రూ.కోటి కాగా, ప్రతి ఏడాది 10 శాతం చొప్పున ఈ ఫీజు పెరుగుతుంది. ఐదేళ్లకు ఒకేసారి లైసెన్సులు జారీ చేస్తారు. ప్రీమియం స్టోర్లకు దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ చర్యలతో నాణ్యమైన లిక్కర్ అందుబాటులోకి రావడంతో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే ప్రభుత్వ ఆదాయం పెరగడంతోపాటు కొత్త బార్ల, ప్రీమియం స్టోర్ల ఏర్పాటుతో మద్యం వ్యాపారంలో మరింత పారదర్శకత తీసుకురానున్నారు.