Solar Power Plants: ఇరిగేషన్ భూముల్లో సోలార్ ప్లాంట్లు.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా జలవనరుల శాఖలో కీలక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణలో పారదర్శకత పెంచడంతోపాటు ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల పరిస్థితిపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వివరాలు
ఇరిగేషన్ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు
సాగునీటి శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న వేలాది ఎకరాల భూములను ఆదాయ వనరులుగా మార్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇరిగేషన్ శాఖకు చెందిన ప్రతి ఎకరా భూమిని సమర్థంగా వినియోగించుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.
ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాలు, కాలువల గట్లు, ఇతర ఖాళీ స్థలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.
ఇందుకు సంబంధించి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
ఈ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల ఎత్తిపోతల పథకాల నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్ ఖర్చును తగ్గించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
వివరాలు
జలహారతి కార్పొరేషన్‌కు నిర్వహణ బాధ్యతలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, నిరంతర నిర్వహణ, మరమ్మతుల బాధ్యతలను జలహారతి కార్పొరేషన్‌కు అప్పగించాలని సీఎం నిర్ణయించారు.
రైతులకు సాగునీరు అందించడంలో కీలకమైన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు నిరుపయోగంగా మారకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే గుర్తించి పరిష్కరించేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
ఈ బాధ్యతలను జలహారతి కార్పొరేషన్ ద్వారా నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.
వివరాలు
వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు?
రాష్ట్రంలో నీటి వినియోగం, కేటాయింపులు, సాగునీటి ప్రాజెక్టుల పర్యవేక్షణలో జవాబుదారీతనం పెంచేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తరహాలోనే నీటి రంగానికి కూడా వాటర్ రెగ్యులేటరీ కమిషన్‌ను తీసుకురావాలని చంద్రబాబు ప్రతిపాదించారు.
నీటి పంపిణీలో పారదర్శకత తీసుకురావడం, ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధుల కేటాయింపును పర్యవేక్షించడం, నీటి సంబంధిత వివాదాలను పరిష్కరించడం ఈ కమిషన్ ప్రధాన బాధ్యతలుగా ఉండనున్నాయి.
ఈ ప్రతిపాదనపై వెంటనే సమగ్ర నివేదిక అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
వివరాలు
రెండున్నరేళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలి
రాష్ట్రంలో భారీ స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం 36 కీలక సాగునీటి ప్రాజెక్టులను గుర్తించింది.
వీటి నిర్మాణాలు, పెండింగ్‌లో ఉన్న పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని నిర్ణయించింది.
రాబోయే రెండున్నరేళ్లలో ఈ 36 ప్రాజెక్టులను పూర్తిచేసి ఆయకట్టుకు నీరందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత రానివ్వబోమని సీఎం స్పష్టం చేశారు.
పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తానే స్వయంగా సమీక్షిస్తానని తెలిపారు.
వివరాలు
రెండున్నరేళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలి
పాడైపోయిన ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేపట్టేందుకు రూ.600 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ నిధులతో అవసరమైన పనులు పూర్తి చేసి వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యే నాటికి పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తద్వారా గరిష్ఠ ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఒకవైపు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం, మరోవైపు ఇరిగేషన్ శాఖ భూముల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవడం ద్వారా జలవనరుల శాఖను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.