
ROJA : మంత్రి రోజాపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ప్రేమజంట.. తమకేం జరిగినా రోజాదే బాధ్యతని స్పష్టం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజాపై ఓ ప్రేమజంట సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు రోజా మూలంగా తమకు ప్రాణగండం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించింది. చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన ప్రవీణ, నెల్లూరుకు చెందిన జిలానీలు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు.
అయితే ఇద్దరి మతాలు వేరు కావడంతో ప్రవీణ తల్లిదండ్రులు వివాహానికి నిరాకరించారు.
ఇదే సమయంలో ప్రవీణకు పెళ్లి సంబంధాలను చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ ఇంటి నుంచి వెళ్లిపోయి, జిలానీని రహస్యంగా ప్రేమ వివాహం చేసుకుంది.
DETAILS
రక్షణ కల్పించాలని డీజీపీకి విజ్ఞప్తి చేసిన ప్రేమజంట
అక్కడ్నుంచి తమకు కష్టాలు, బెదిరింపులు మొదలయ్యాయని ప్రేమ జంట చెబుతోంది. తమకు రోజా నుంచి ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
తమకు పోలీసులు రక్షణ కల్పించకుండా రోజా ఒత్తిడి చేస్తున్నారని ప్రవీణ, జిలానీ జంట ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు ఏం జరిగినా మంత్రి రోజానే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. తమకు పోలీస్ రక్షణ కల్పించాలని కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని అభ్యర్థించారు.