Encumbrance Certificate Download : ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్ జారీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (EC) అనేది ఆస్తి యాజమాన్యాన్ని ధృవీకరించే ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది ఆస్తుల క్రయ, విక్రయాల ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆస్తి చట్టపరమైన, ఆర్థిక పరిస్థితిని నిర్ధారించేందుకు ఈసీ ఉపయోగపడుతుంది. దీనిని ఆస్తి ధృవీకరణ పత్రంగా కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఈసీ జారీ ప్రక్రియలో సౌకర్యవంతమైన మార్పులు తీసుకువచ్చింది. ఈ మార్పుల ప్రకారం, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు లేదా మీ-సేవా కేంద్రాలను సందర్శించే అవసరం లేకుండా, ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే ఈసీని కేవలం 5 నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది.
ఈసీ పొందడానికి..
ఈసీ పొందడానికి, ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్ (https://cardprimme.rs.ap.gov.in/PDE/ECRegistrationPage) లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అవసరమైన ఆస్తి వివరాలను నమోదు చేసి, ఆన్‌లైన్‌లో చెల్లింపులు పూర్తి చేయడం ద్వారా ఈసీ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసీ ద్వారా ఆస్తికి సంబంధించిన యాజమాన్యం హక్కులు, తాత్కాలిక హక్కులు, చట్టపరమైన బకాయిలు, ఆస్తి చరిత్ర, బుక్ నంబర్, వాల్యూమ్ నంబర్, డాక్యుమెంట్ నంబర్ వంటి వివరాలు పొందవచ్చు. ఆస్తి క్రయ, విక్రయ లావాదేవీల్లో పాల్గొన్న వ్యక్తుల పేర్ల గురించి కూడా ఈసీ స్పష్టతనిస్తుంది.
ఈసీ సర్టిఫికేట్ పొందడం సులభం
ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ ఆస్తి కొనుగోలుదారులు, విక్రేతలకు అత్యంత ముఖ్యమైన పత్రం. ఇది ఆస్తి నిజమైన యాజమాన్యాన్ని నిర్ధారించడంలో సహాయపడుతుంది. అలాగే, మోసపూరిత లావాదేవీలను నివారించడంతో పాటు ఆస్తి విలువ, వినియోగం, హక్కులను అంచనా వేయడంలో కూడా సహాయపడుతుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఈసీ సర్టిఫికేట్ పొందడం సులభం. ఈ కొత్త విధానం సమయాన్ని, శ్రమను ఆదా చేయడంతో పాటు ఆస్తి సంబంధిత లావాదేవీలను మరింత భద్రతగా, పారదర్శకంగా చేస్తుంది.