Andhrapradesh: కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతుండగా, ఇది గురువారం ఉదయం తుపానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రెండు రోజుల్లో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని చేరి, తమిళనాడులోని కడలూరు జిల్లా పరంగిపేట్టై నుంచి చెన్నై మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ తుపానుకు సౌదీ అరేబియా సూచించిన 'ఫెన్‌గల్' అని నామకరణం చేయనున్నారు. ఈ తుపాను ప్రభావంతో గురువారం నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను శుక్రవారం వరకు తీవ్ర స్థాయిలో ఉండి, శనివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది.
పోర్టులకు మొదటి నంబర్ హెచ్చరికలు జారీ
తీర ప్రాంతాల్లో గరిష్ఠంగా గంటకు 75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని సూచించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు మొదటి నంబర్ హెచ్చరికలు జారీ చేశారు.