LOADING...
Amaravati: అమరావతి తొమ్మిది నగరాల్లో రవాణా సదుపాయాలు కల్పించడంపై ఏపీఎస్‌ఆర్టీసీ దృష్టి

Amaravati: అమరావతి తొమ్మిది నగరాల్లో రవాణా సదుపాయాలు కల్పించడంపై ఏపీఎస్‌ఆర్టీసీ దృష్టి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజధాని అమరావతిలో రాబోయే రోజుల్లో ప్రజల రాకపోకలు భారీగా పెరిగే అవకాశం ఉన్నందున, అవసరమైన రవాణా సదుపాయాల కల్పనపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో, అమరావతిలో ఓ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రజలు సులభంగా ప్రయాణించగలిగేలా బస్టాండ్లు, డిపోలు, టెర్మినల్స్‌ వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి అనుకూలమైన భూములను కేటాయించేందుకు సంస్థ కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ఇతర సంస్థలకు సీఆర్‌డీఏ పరిధిలో భూముల కేటాయింపు జరిగిన నేపథ్యంలో,ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లోనే బస్టాండ్ల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. అందుకే ఇప్పటి నుంచే భూముల కేటాయింపుపై ప్రణాళిక రూపొందించుకొని, ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

వివరాలు 

తొమ్మిది నగరాల్లో 90 ఎకరాల భూమి అవసరం 

అమరావతి మహానగర పరిధిలో ప్రభుత్వం పరిపాలన, న్యాయ, ఆర్థిక, విజ్ఞాన, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య, క్రీడా, మీడియా, పర్యాటక రంగాలకు సంబంధించిన తొమ్మిది నవనగరాలను నిర్మిస్తోంది. ఈ నగరాల్లో ఒక్కొక్కటిలో ఒక బస్టాండ్, దానికి అనుబంధంగా ఒక డిపోను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ యోచిస్తోంది. ప్రతి బస్టాండ్‌కు 5 ఎకరాలు, ప్రతి డిపోకు 5 ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేసింది. అంటే మొత్తం తొమ్మిది బస్టాండ్లు,డిపోలు కలిపి 90 ఎకరాల భూమి అవసరమవుతుందని నిర్ధారించారు. ఈ డిపోల నుంచి నడిచే బస్సులు సంబంధిత నగరాల మధ్య మాత్రమే కాకుండా, అమరావతికి సమీపంలోని విజయవాడ, గుంటూరులకు ప్రయాణించేవారికి కూడా సేవలందించనున్నాయి.

వివరాలు 

మూడు ఇంటర్‌ఛేంజ్‌ టెర్మినల్స్‌ ఏర్పాటు యోచన 

దూర ప్రాంతాల నుంచి అమరావతికి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మూడు ప్రధాన ప్రదేశాల్లో ఇంటర్‌ఛేంజ్‌ టెర్మినల్స్‌ ఏర్పాటుపై కూడా ఆర్టీసీ ప్రణాళిక రూపొందిస్తోంది. వీటిలో ఒకటి ఉత్తరాంధ్ర,విశాఖపట్నం వైపు నుంచి వచ్చే బస్సులకు, రెండోది రాయలసీమ, చెన్నై, బెంగళూరు వైపుల నుంచి వచ్చే బస్సులకు, మూడోది హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చే బస్సులకు అనుకూలంగా ఉంటుంది. ఈ టెర్మినల్స్‌ ద్వారా బయట ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు నేరుగా రాజధాని అంతర్భాగంలోకి ప్రవేశించకుండా, అక్కడే ఆగిపోతాయి. అక్కడినుంచి నగరానికి చెందిన సిటీ బస్సుల ద్వారా ప్రయాణికులను అంతర్భాగాలకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేస్తారు. ప్రతి టెర్మినల్‌కు 25 ఎకరాల చొప్పున, మూడు టెర్మినల్స్‌కు కలిపి 75 ఎకరాల భూమి అవసరం ఉంటుంది.

వివరాలు 

మొత్తం 165 ఎకరాల అవసరం - సీఆర్‌డీఏకు లేఖ 

ఇలా నవనగరాల్లోని బస్టాండ్లు, డిపోలు,మూడు ఇంటర్‌ఛేంజ్‌ టెర్మినల్స్‌ కలిపి మొత్తం 165 ఎకరాల భూమి అవసరమవుతుందని ఆర్టీసీ అంచనా వేసింది. ఈ అవసరాన్ని గుర్తించి, అవసరమైన భూముల కేటాయింపునకు సంబంధించి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)కు అధికారికంగా లేఖ రాసింది. దీనితో పాటు, ఈ విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ఏర్పాట్లు కూడా ఆర్టీసీ యాజమాన్యం చేపట్టింది.