మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్ కన్నీటి పర్యంతం
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లు బుధవారం అర్థరాత్రి కొందరు పోలీసులు మద్యం మత్తులో తమపై అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. వర్షానికి తమ పరుపులు తడిచాయని, ఈ క్రమంలో నిరసన స్థలానికి మడత మంచాలు తీసుకొస్తున్న సమయంలో తమపై పోలీసులు దాడి చేశారని రెజ్లర్లు పేర్కొన్నారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇద్దరు రెజ్లర్ల తలకు గాయాలయ్యాయి. ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడిపోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వర్షాలకు రెజ్లర్ల పరుపులు తడిచిపోవడంతో ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి మడత మంచాలను నిరసన స్థలానికి తీసుకొచ్చారు. పోలీసులు వాటికి అనుమిత లేదని చెప్పడంతో చిన్న వాగ్వాదం చెలరేగింది. అనంతరం సోమనాథ్ భారతిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మా పథకాలను వెనక్కి తీసుకోండి: ఫోగాట్, పునియా
అర్థరాత్రి పోలీసుల తీరుపై ఆసియా, కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత వినేష్ ఫోగట్ మండిపడ్డారు. పోలీసులు కఠినంగా ప్రవర్తించేందుకు తాము నేరస్థులమా? అని ప్రశ్నించారు. పోలీసుల దగ్గర తుపాకులు ఉన్నాయని, తమను చంపాలనుకుంటే, వెంటనే చంపాలని కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికోసమే తాము దేశానికి పతకాలు తెచ్చామా అని వాపోయారు. ప్రభుత్వం తమ పథకాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. మహిళను దుర్భాషలాడే హక్కు ప్రతి ప్రతి పురుషుడికి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా మాట్లాడుతూ, తాను సాధించిన అన్ని పతకాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
ధర్మేంద్ర అనే పోలీసు మద్యం సేవించి వినేష్ ఫోగట్‌ను దుర్భాషలాడారు: మాజీ రెజ్లర్ రాజ్‌వీర్
అర్థరాత్రి ఉద్రిక్తతలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది పోలీసులు మద్యం మత్తులో తమపై దాడి చేశారని రెజ్లర్లు ఆరోపించడం అందులో వినవచ్చు. ధర్మేంద్ర అనే పోలీసు మద్యం సేవించి వినేష్ ఫోగట్‌ను దుర్భాషలాడినట్లు, తమ గొడవకు దిగినట్లు మాజీ రెజ్లర్ రాజ్‌వీర్ చెప్పారు. పోలీసుల దాడిలో కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ గీతా ఫోగట్ తమ్ముడు దుష్యంత్ ఫోగట్ తలపగిలినట్లు రాజ్‌వీర్ పేర్కొన్నారు. ఘర్షణ తర్వాత నిరసన స్థలంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. నిరసన చేస్తున్న మల్లయోధుల వద్దకు మీడియాను అనుమతించకుండా మొత్తం బ్యారికేడ్ చేశారు. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.