LOADING...
Andhra news: గోదావరిలో సగటున 3,000 టీఎంసీల వృథా.. ఆ నీటి నుంచే బనకచర్లకు మళ్లించే ఆస్కారం
గోదావరిలో సగటున 3,000 టీఎంసీల వృథా.. ఆ నీటి నుంచే బనకచర్లకు మళ్లించే ఆస్కారం

Andhra news: గోదావరిలో సగటున 3,000 టీఎంసీల వృథా.. ఆ నీటి నుంచే బనకచర్లకు మళ్లించే ఆస్కారం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా ప్రతి రోజు 2 టీఎంసీల గోదావరి నికర జలాలను కరువుతో బాధపడుతున్న ప్రాంతాలవైపు మళ్లించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం 3,000 టీఎంసీలకు మించిన వరదనీరు సముద్రంలో కలిసిపోతుంది. అయితే, ఈ మిగులు జలాలు 75% విశ్వసనీయత వద్ద ఏ మేరకు ఉంటాయి? అసలు సగటున 3,000 టీఎంసీల సముద్రంలో కలిసినా ఎన్ని రోజుల పాటు 2 టీఎంసీలు బనకచర్లకు మళ్లించేందుకు వీలుంటుందనేది చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో,నీటివనరుల శాఖ గత 57ఏళ్ల గోదావరి నది ప్రవాహ డేటాను విశ్లేషించి,ఎన్ని రోజులు ఎంతమేర నీరు సముద్రంలోకి కలిసిపోయిందో స్పష్టమైన లెక్కలు తయారు చేసింది.

వివరాలు 

వృథా అవుతున్నది 146 రోజులు 

ఈ గణాంకాలను ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్రానికి తగిన వాదనలు వినిపించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద సగటున 146రోజుల పాటు ప్రతిరోజూ 25,000 క్యూసెక్కులకంటే ఎక్కువ పరిమాణంలో వరద నీరు సముద్రంలోకి వృథాగా చేరుతోందని అధికారులు గుర్తించారు. అంటే ఈ కాలంలో రోజుకు 2 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలోకి కలిసిపోతున్నట్లవుతుంది. ప్రత్యేకంగా 1990-91 నీటి సంవత్సరంలో చూస్తే, ఏకంగా 209 రోజులు రోజుకు 2 టీఎంసీలకన్నా అధిక పరిమాణంలో నీరు వృథాగా పోయిందని రికార్డులున్నాయి. ఇక అత్యంత తక్కువ ప్రవాహంతో గుర్తింపు పొందిన 2009-10 నీటి సంవత్సరంలో కూడా, 92 రోజుల పాటు ప్రతిరోజూ 2 టీఎంసీలకంటే ఎక్కువ నీరు సముద్రంలో కలిసిపోయినట్టు గణాంకాలు స్పష్టంగా చూపుతున్నాయి.