Ex-Karnataka minister: కాంగ్రెస్ మాజీ మంత్రి బి.నాగేంద్రకు 6 రోజుల ED రిమాండ్..
కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో కాంగ్రెస్ మాజీ మంత్రి బి.నాగేంద్ర ను ED అదుపులోకి తీసుకుంది. ఆయన హాయంలో రూ.94 కోట్ల వరకు నిధులు దుర్వినియోగం అయ్యాయని ఇడి తన రిమాండ్ దరఖాస్తులో పేర్కొంది. ఆయన ఆదేశాల మేరకు, కార్పొరేషన్ ఖాతాలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వసంత్ నగర్ శాఖ నుండి దాని MG రోడ్‌కు బదిలీ అయ్యాయి. నాగేంద్రను శనివారం జడ్జి సంతోష్ గజానన్ ముందు హాజరుపరిచిన తర్వాత, ED 14 రోజుల కస్టడీని అభ్యర్థించింది. అయితే, 52 ఏళ్ల నాగేంద్ర తన ఆరోగ్య సమస్యలను జడ్జి దృష్టికి తెచ్చారు.
14 రోజుల కస్టడీ కోరిన ED
ఆయనకు రోజువారీ ఆరోగ్య పరీక్షలు చేయమని న్యాయమూర్తి ఆదేశించారు. కేవలం ఆరు రోజుల రిమాండ్ కు అనుమతించారు. అరెస్ట్ కు ముందు ఆయనను రెండు గంటల పాటు విచారించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నాగేంద్ర న్యాయమూర్తికి తెలిపారు. ఇది బోర్డు మీటింగ్ ద్వారా జరిగిన మనీ ట్రాన్స్‌ఫర్ అని.. తాను ఆ శాఖ మంత్రిని మాత్రమేనని.. ఎలాంటి అక్రమ నగదు బదిలీలు జరిగినట్లు నాకు తెలియదన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ డబ్బు బదిలీల గురించి సమాచారాన్ని సేకరించి, దుష్ప్రవర్తనపై దర్యాప్తు చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి గజానన్ నాగేంద్రను జూలై 18 వరకు ఇడి కస్టడీకి పంపారు.