Arvind Kejriwal:అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభ బాట?.. పంజాబ్ కాంగ్రెస్ నేత బజ్వా ఆరోపణ
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురించి ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి.
గతంలో, పంజాబ్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన రంగంలోకి దిగుతారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.
అయితే, పంజాబ్ ప్రజలు బాహ్య నాయకత్వాన్ని సమర్థించరనే సంకేతాలు రావడంతో, కేజ్రీవాల్ వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, ఈ ప్రచారాన్ని ప్రస్తుత పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఖండించారు.
ఇదిలా ఉంటే ,కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా కొత్త ఆరోపణలు చేశారు.
వివరాలు
కేజ్రీవాల్ పంజాబ్ రాజకీయాల్లోకి ప్రవేశించే ప్రణాళిక
కేజ్రీవాల్ త్వరలో రాజ్యసభకు వెళ్లే యోచనలో ఉన్నారని,ఈ విషయమై చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఆప్‌కు చెందిన 32 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉన్నారని,ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు దారితీయవచ్చని చెప్పారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో, కేజ్రీవాల్ నిజంగా రాజ్యసభ మార్గాన్ని ఎంచుకుంటారా అనే ప్రశ్న రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
ఇటీవల పంజాబ్‌లో ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి మృతి చెందారు.ఆయన స్థానంలో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది.
ఈ అవకాశం ద్వారా కేజ్రీవాల్ పంజాబ్ రాజకీయాల్లోకి ప్రవేశించే ప్రణాళిక వేసుకున్నారని వార్తలు వెలువడుతున్నాయి.
అయితే,వ్యతిరేకత పెరుగుతుండటంతో ఈ ప్రయత్నం విరమించుకున్నట్లు ప్రచారం ఉంది.
దీనికి ప్రత్యామ్నాయంగా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను ఉపఎన్నిక బరిలోకి దింపే యోచనలో ఉంది.
వివరాలు
స్పందించని ఆప్
లూథియానా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో సంజీవ్ అరోరా పోటీ చేసే అవకాశముందని అంచనాలు నెలకొన్నాయి.
అదే సమయంలో, రాజ్యసభలో ఖాళీ వచ్చే సీటును కేజ్రీవాల్ కోసం ఉపయోగించబోతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
అయితే, ఆప్ ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘోర పరాజయాన్ని చవిచూసింది.
మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా, ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది.
కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి ప్రముఖ నేతలు ఓటమిపాలయ్యారు.
అయితే, ఆప్ నేత అతిషి తక్కువ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం, ఢిల్లీ ముఖ్యమంత్రి బాధ్యతలు రేఖా గుప్తా చేపట్టారు.