Assembly elections: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలో ఒక్క విడతలోనే 288 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఇక జార్ఖండ్‌లో రెండో విడతగా 38 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ మేరకు, ఉత్తరప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కూడా నేడు నిర్వహిస్తున్నారు. ఈ అన్ని స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల 23న జరగనుంది.
మొత్తం 288 స్థానాలకు 4,136 మంది అభ్యర్థులు
మహారాష్ట్రలో ప్రధానంగా బీజేపీ, శివసేన, ఎన్సీపీల కూటమి అయిన మహాయుతి, అలాగే కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (ఎస్పీ)ల కూటమి అయిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. మహాయుతిలో బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీచేస్తుండగా, ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్ 101, శివసేన (ఉద్ధవ్) 95, ఎన్సీపీ (ఎస్పీ) 86 స్థానాల్లో బరిలో నిలిచాయి. మొత్తం 288 స్థానాలకు 4,136 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జార్ఖండ్‌లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య ప్రధాన పోరు కొనసాగుతోంది. రెండో విడత పోలింగ్‌లో ఇక్కడ 38 స్థానాలకు 528 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.