అసెంబ్లీ ఎన్నికలు: 'రాహుల్ జీ.. కర్ణాటక సమస్యలపై గొంతు విప్పాలి'; కాంగ్రెస్ శ్రేణుల వేడుకోలు
నెల రోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఆశపడుతుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 10వ తేదీన ఎన్నికల ప్రచారం కోసం రావడం ఆసక్తికరంగా మారింది. ఆయన కర్ణాటకకు వస్తే ఏం మాట్లాడుతారనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాహుల్ ఇటీవల ఎక్కడ మాట్లాడినా, ట్వీట్ చేసినా అదానీ విషయం తప్పా వేరేది మాట్లాడటం లేదు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అదానీ అంశం అంత ప్రభావం చూపకపోవచ్చని స్థానిక కాంగ్రెస్ నాయుకలు చెబుతున్నారు. ఒకటి, రెండు సార్లు అయితే ఓకే కానీ, ప్రతి చోట అదానీ అంశం వర్కవుట్ కాకపోవచ్చని అంటున్నారు.
జాతీయ స్థాయి సమస్యలను లేవనెత్తితే మోదీ వర్సెస్ రాహుల్‌గా మారే అవకాశం
2019లో కర్ణాటకలో చేసిన వ్యాఖ్యల వల్లే రాహుల్ గాంధీకు సూరత్ కోర్టు జైలు శిక్ష విధించింది. పర్యావసానంగా రాహుల్ లోక్‌సభకు అనర్హుడయ్యారు. ఈ కోణంలో కూడా రాహుల్ మాటలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాహుల్ అదానీ అంశం కాకుండా రాష్ట్రంలోని సమస్యలపై గళం విప్పాలని కర్ణాటక నాయకులు కోరుతున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిపై బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అంటున్నారు. కర్ణాటకలో జాతీయ స్థాయి సమస్యలను లేవనెత్తితే అది మోదీ వర్సెస్ రాహుల్‌గా మారే అవకాశం ఉందని, తద్వార బీజేపీకే అనుకూలంగా మారుతుందని మరికొందరు కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. అందుకే కర్ణాటక ప్రచారంలో బొమ్మై ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై రాహుల్ గొంతు విప్పాలని స్థానిక నాయకత్వం కోరుతోంది.