పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ తన బెయిల్ పిటిషన్‌లో చెప్పిన విషయాలు ఏంటంటే?
'మోదీ ఇంటిపేరు'పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్‌లోని సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 13న తన రాహుల్ బెయిల్ పిటిషన్‌పై తిరిగి విచారించనున్నది. అయితే రాహుల్ గాంధీ ఆ బెయిల్ పిటిషన్‌లో ఏం పేర్కొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. క్రిమినల్ చట్టంలో అస్సలు అనుమతి లేని ఊహల ఆధారంగా తీర్పును ప్రకటించారని రాహుల్ గాంధీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మోదీలు 13 కోట్ల మంది ఉన్నారని, ఈ వ్యక్తులందరికీ ఫిర్యాదును దాఖలు చేసే హక్కు ఉండదన్నారు. ఎందుకంటే ఇది గుర్తించదగిన, కచ్చితమైన సమూహం కాదన్నారు.
వ్యాఖ్యల సారాంశాన్ని న్యాయస్థానాలు అర్థం చేసుకోవాలి: రాహుల్ గాంధీ
మోదీ కమ్యూనిటీ అనేది రికార్డులో ఎక్కడా లేదని రాహుల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతి కమ్యూనిటీలో మోదీలు ఉన్నారని చెప్పారు. మోదీ మోడీ ఇంటిపేరు ఉన్న వ్యక్తుల సంస్థ లేదని వివరించారు. పరువు నష్టం కలిగించే ప్రకటనలో ప్రస్తావించబడిన మోదీల సమూహం లేదన్నారు. నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన తాను పరిధి మేరకు మాట్లాడినట్లు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడి మాటలను తూకం వేసి మరీ చూడద్దని అభ్యర్థించారు. అందుకే తాను చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని న్యాయస్థానాలు అర్థం చేసుకోవాలన్నారు. బలమైన ప్రజాస్వామ్యానికి బలమైన, రాజీలేని ప్రతిపక్షం అవసరమని రాహుల్ పేర్కొన్నారు.