Page Loader
సూరత్ న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ నేడు సెషన్స్ కోర్టులో రాహుల్  అప్పీల్
సూరత్ న్యాయస్థానం తీర్పు, జైలు శిక్షను సవాల్ చేస్తూ నేడు సెషన్స్ కోర్టుకు రాహుల్

సూరత్ న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ నేడు సెషన్స్ కోర్టులో రాహుల్ అప్పీల్

వ్రాసిన వారు Stalin
Apr 03, 2023
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

పరువు నష్టం కేసులో సూరత్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు, రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం గుజరాత్‌లోని సూరత్‌లోని సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేయనున్నారు. అయితే ఈ కేసును ఈ రోజే విచారించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 2019లో కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో 'దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది?' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌పై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో గత నెల 23న సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చింది. అనంతరం రెండేళ్ల జైలుశిక్ష విధించింది.

సూరత్

రాహుల్ వెంట కోర్టు ప్రియాంక గాంధీ

సూరత్‌లోని సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేయడానికి రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా వెళ్లనున్నారు. ప్రియాంకతో పాటు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, సీఎల్పీ నేత బాలాసాహెబ్ థోరట్ రాహుల్ వెంట వచ్చే అవకాశం ఉంది. సూరత్ కోర్టు తీర్పు తర్వాత రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ పార్లమెంటు లోపల, బయట కాంగ్రెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.