Ys Vijaamma: వైఎస్సార్ పేర్లపై ఆస్తులు రాశారు.. ఆస్తుల వివాదంలో విజయమ్మ స్పష్టత
వైఎస్సార్ ఉన్నప్పుడు ఆస్తులు పంచారని ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి ఆడిటర్‌గా ఉన్నందున, ఆయనకు అన్ని విషయాలు తెలుసునని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి తమ కుటుంబ సభ్యుడిగా ఆస్తుల అగ్రిమెంట్‌పై సాక్షి సంతకం చేశారని ఆమె గుర్తు చేశారు. అయినప్పటికీ మీడియాతో అవాస్తవాలను మాట్లాడడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు కొన్ని ఆస్తులు జగన్, వైఎస్ షర్మిల పేర్ల మీద రాశారని, ఇది ఆస్తుల పంపిణీ కాదని తెలిపారు.
నలుగురు బిడ్డలకు సమానంగా ఆస్తులు
మంగళవారం విడుదల చేసిన బహిరంగ లేఖలో విజయమ్మ పలు కీలక అంశాలను వెల్లడించారు. తల్లిగా తనకు జగన్, షర్మిల ఇద్దరూ సమానమే అని, ఆస్తులు కూడా ఇద్దరికీ సమానంగా పంచాల్సిందేని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ తన ఆస్తులను నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా పంచాలని చెప్పారన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 2009 నుంచి 2019 వరకు ఇద్దరు కలసి ఉన్నారని, డివిడెండ్ రూపంలో జగన్ తన వాటా తీసుకుని, రూ.200 కోట్లు షర్మిలకు ఇచ్చారని పేర్కొన్నారు. అగ్రిమెంట్ ప్రకారం, జగన్‌కు 60 శాతం, షర్మిలకు 40 శాతం ఉందన్నారు.
షర్మిలకు అన్యాయం జరిగింది
2019లో సీఎం అయిన రెండు నెలలకు, జగన్ అటాచ్‌మెంట్ ఉన్న ఆస్తులను విడదీయాలని ప్రపోజల్ ఇచ్చారని, అటాచ్‌మెంట్‌లో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, ఎలహంక ప్రాపర్టీ 100 శాతం షర్మిలకు ఇవ్వాలనే నిర్ణయించుకున్నారని చెప్పారు. అయితే ఈ ఆస్తులు ఇవ్వకుండానే షర్మిలకు అన్యాయం జరిగిందన్నారు. షర్మిలకు చేరాల్సిన భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్ఆర్ ఇల్లు వంటి ఆస్తులను కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉందని విజయమ్మ పేర్కొన్నారు.