
టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే రూ.100కోట్లు పంచుతా: ప్రముఖ కంపెనీ సీఈఓ
ఈ వార్తాకథనం ఏంటి
ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్-2023 టైటిల్ పోరుకు టీమిండియా సిద్ధమైంది.
12 ఏళ్ల క్రితం ఎంఎస్ ధోని సారథ్యంలో శ్రీలంకను ఓడించి భారత జట్టు రెండోసారి వరల్డ్ కప్‌ను ముద్దాడింది.
ఇప్పుడు రోహిత్ శర్మ సారథథ్యంలో మరోసారి ప్రపంచ కప్‌ను దక్కించుకునే దిశగా ముందుకుసాగుతోంది.
ఇదే సమయంలో భారతీయులు తమదైన రీతిలో టీమ్ ఇండియాను ఉత్సాహపరిచే పనిలో నిమగ్నమై ఉన్నారు.
ఈ క్రమంలోనే ఆస్ట్రోటాక్ అనే ఆస్ట్రో స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ పునీత్ గుప్తా షాకింగ్ ప్రకటన చేశాడు.
టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే.. తమ కస్టమర్లకు రూ.100కోట్లు పంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియా
2011 జ్ఞాపకాలను పంచుకున్న సీఈఓ
2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు తాను కాలేజీలో చదువుతున్నానని పునీత్ గుప్తా తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
ఆ రోజు తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజులలో ఒకటని అని చెప్పారు. కాలేజీకి దగ్గరలో ఉన్న ఆడిటోరియంలో తన స్నేహితులతో కలిసి ఆ మ్యాచ్ చూసినట్లు గుర్తు చేశారు.
తాము ఆ రోజంతా తీవ్ర ఒత్తిడికి లోనయ్యామన్నారు. ఆ రోజు ముందు రాత్రంతా తాము మ్యాచ్ గురించే చర్చించుకున్నట్లు, సరిగా నిద్ర కూడా పోలేదని చెప్పుకొచ్చారు.
ఈ సారి ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. తమ కస్టమర్లకు రూ.100 కోట్లను పంపిణీ చేస్తామన్నారు.
ఈ విషయంపై తాను ఫైనాన్స్ బృందంతో కూడా చర్చించినట్లు పేర్కొన్నారు.