Atishi: శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది: అతిషి మార్లెనా
దేశ రాజధాని దిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వెలుపల జరిగిన పేలుడు కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి అతిషి మార్లెనా, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నా, వారు పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు.
దిల్లీ ముంబయిలా మారిపోతుంది: అతిషి
"ఈ పేలుడు ఘటనతో రాజధాని నగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని తెలుస్తోంది. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అయితే, బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దిల్లీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న పనులకు అంతరాయం కలిగించడానికి మాత్రమే తాము సమయాన్ని వినియోగిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల దిల్లీ ముంబయిలా మారిపోతుంది. ప్రస్తుతం బహిరంగంగా తూటాలు పేలుతున్నాయి, గ్యాంగ్‌స్టర్లు డబ్బు డిమాండ్ చేస్తున్నారు. వీటిని నియంత్రించేందుకు బీజేపీకు సామర్థ్యం లేదు" అని 'ఎక్స్' వేదికగా ఆమె అన్నారు.
సీఆర్పీఎఫ్ పాఠశాల వెలుపల తెల్లవారుజామున పేలుడు
"బీజేపీకి ప్రజలు పొరపాటున ప్రభుత్వ బాధ్యతలు అప్పగిస్తే ఆస్పత్రులు, విద్యుత్, నీటి సరఫరాలో ఆటంకాలు ఉంటాయని" పేర్కొన్నారు. కాగా, రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వెలుపల తెల్లవారుజామున పేలుడు సంభవించింది. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక శాఖ, క్రైమ్, ఎఫ్‌ఎస్ఎల్ బృందాలు, బాంబు డిస్పోజల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
బీజేపీ కౌంటర్
ఈ పేలుడు ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు, కానీ పేలుడు ధాటికి పాఠశాల గోడ కూలిపోయింది. శబ్ద తీవ్రతకు సమీపంలోని కారు అద్దాలు పగిలిపోయాయి. దుకాణాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై స్పందించిన సీఎం అతిషీ బీజేపీపై మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. "తోలుబొమ్మ సీఎం" అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. "సమస్య పరిష్కారం గురించి ఆలోచించకుండా రాజకీయాలు చేయడం సరికాదు" అని వ్యాఖ్యానించింది.