Atishi: ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అతిషి.. పక్కన ఖాళీ కుర్చీతో
అతిషి మార్లెనా (Atishi) సోమవారం నాడు ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె తన పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తపరిచారు. కేజ్రీవాల్ కోసం ఒక ఖాళీ కుర్చీని పక్కన ఉంచి, తాను మరో సీటులో కూర్చొని బాధ్యతలను స్వీకరించారు. దీనికి సంబంధించిన చిత్రాలను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పంచుకుంది.
''భరతుడికి వచ్చిన పరిస్థితి నాకు ఇప్పుడు వచ్చింది": ఆతిషి
తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ రామాయణంలోని ఒక ఘట్టాన్ని ప్రస్తావించారు. ''భరతుడికి వచ్చిన పరిస్థితి నాకు ఇప్పుడు వచ్చింది. రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు, భరతుడు సింహాసనంపై రాముడి పాదుకలు ఉంచి పాలనను కొనసాగించాడు. ఈ కుర్చీ కేజ్రీవాల్‌ది. మళ్లీ ఎన్నికల అనంతరం, నాలుగు నెలల తర్వాత, ఆయన అధికారంలోకి తిరిగి వస్తారని నమ్ముతున్నాను. ఆయన తిరిగి వచ్చే వరకు ఈ కుర్చీ ఇక్కడే ఉంటుంది'' అని ఆతిషి తెలిపారు. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని జైలు నుంచి ఇటీవల విడుదలైన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆతర్వాత ఆప్ నాయకత్వం ఆమెను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఆతిషితో బాటు ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం
లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదంతో, రెండు రోజుల క్రితం ఆతిషి ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో పాటు ముకేశ్ అహ్లావత్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ క్రమంలో, సౌరభ్ భరద్వాజ్ గతంలో మాట్లాడుతూ, ''కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలు తీర్పు ఇవ్వేవరకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడాన్ని నిరాకరించారు. అయినప్పటికీ, ప్రజల తీర్పు మేరకు ఈ ఐదు సంవత్సరాల పాటు ఆ పదవి ఆయనదే. రాముడు లేనప్పుడు భరతుడు అయోధ్యను పాలించినట్టు, మాలో ఒకరు రాబోయే ఎన్నికల వరకు ఢిల్లీకి సీఎంగా ఉంటారు'' అని చెప్పారు.