
Post mortem: బిహార్ ఆసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని మెట్లపై ఈడ్చుకెళ్లిన సిబ్బంది
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మానవత్వం మరచిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం (Post-Mortem) కోసం తీసుకువచ్చిన మృతదేహాన్ని మార్చురీ సిబ్బంది స్ట్రెచర్ ఉపయోగించకుండా మెట్లపై ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటన స్థానికుల ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆసుపత్రికి చేరిన మృతదేహాన్ని మార్చురీకి తరలించాల్సిన బాధ్యత వహించిన సిబ్బంది, నిబంధనలు పట్టించుకోకుండా మానవత్వాన్ని తాకట్టు పెట్టి అమానుషంగా ప్రవర్తించారు. ఆ సమయంలో మృతదేహాన్ని ఈడ్చుకెళ్తున్న వారిలో ఓ పోలీస్ సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను కెమెరాలో బంధించడంతో, ఘటన బయటపడింది.
Details
మార్చురీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
వీడియో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ ధర్మేంద్ర కుమార్ స్పందించారు. మార్చురీ సిబ్బందిపై వెంటనే సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఘటనలో పాలుపంచుకున్న పోలీస్‌పై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. కలెక్టర్ మాట్లాడుతూ, 72 గంటల్లో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.