Kerala: కేరళలో దారుణం.. 18 ఏళ్ల అథ్లెట్‌పై 60 మందికి పైగా లైంగిక వేధింపులు
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో అమానవీయమైన ఘటన వెలుగులోకొచ్చింది. 18 ఏళ్ల అథ్లెట్‌పై దాదాపు 60 మందికి పైగా వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
ఐదు సంవత్సరాల పాటు ఈ దారుణాలను అనుభవించిన ఆ యువతి చివరకు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు తన బాధను వ్యక్తం చేయడంతో ఈ అమానుష ఘటన బయటికొచ్చింది.
ఈ మేరకు పథనంథిట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు తన ఫిర్యాదులో, 13 ఏళ్ల వయస్సులో తనపై అత్యాచారం జరిగిందని వెల్లడించింది.
ఆ సమయంలో తన పొరుగింట్లోని ఒక వ్యక్తి తనను కొండ ప్రాంతాలకు తీసుకెళ్లి, అక్కడ స్నేహితులతో కలిసి అత్యాచారానికి గురి చేశారని ఆమె వాపోయింది.
Details
62 మంది అనుమానితులను గుర్తించిన పోలీసులు
దాని తర్వాత కోచ్‌లు, తోటి ఆటగాళ్లు కూడా ఆమెపై లైంగిక వేధింపులు చేశారని పేర్కొంది.
భయంతోనే ఈ విషయాన్ని బయటపెట్టలేదని ఆమె వివరించింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సూమారు 62 మంది అనుమానితులను గుర్తించారు.
వారిలో 40 మందిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఐదుగురి నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని ప్రస్తుతం షెల్టర్ హోంకు తరలించారు.
కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాధితురాలికి అన్నివిధాలా అండగా ఉంటామని ప్రకటించింది.