రుణాల ఎగవేత కారణంగా వైసీపీ ఎమ్మెల్యే ఆస్తుల వేలం
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గట్టి షాక్ తగిలింది. కెనరా బ్యాంకు అతని ఆస్తులను వేలం వేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటనను విడుదల చేసింది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హామీదారుగా ఉన్న కంపెనీ తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేదు. దీంతో ఆగస్టు 18న ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 30 నాటికి వడ్డీతో కలిపి రూ.908 కోట్లు అయినట్లు బ్యాంకు తెలిపింది. ఈ ఆస్తులన్నీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. మెసర్స్ సాయిసుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కెనరా బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంది. అయితే వాటిని ఆ కంపెనీ చెల్లించలేదు.
నోటీసులకు స్పందించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
2005 డిసెంబరులో ఏఎస్‌ఆర్ ఇంజినీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొదట్లో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, ఆయన తండ్రి వెంకటరామిరెడ్డి డైరెక్టర్లుగా ఉన్నట్లు సమాచారం. తర్వాత శ్రీధర్‌రెడ్డి రాజీనామా చేశారు. 2014లో ఆయన భార్య అపర్ణరెడ్డి డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టారు. తమ కంపెనీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో చేపట్టిన పనులను చేసిందని, అయితే ఆ పనులకు సంబంధించి బిల్లులు మంజూరు కాకపోవడంతో సకాలంలో వడ్డీలు చెల్లించలేదని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చెబుతున్నారు. రుణాల కోసం తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తామని కెనరా బ్యాంకు నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులకు స్పందించకపోవడంతోనే ఆస్తుల వేలానికి సిద్ధమైనట్లు బ్యాంకు చెబుతోంది. షూరిటీగా పెట్టిన ఆస్తుల్లో ఎక్కువగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని భూములు ఉన్నట్లు తెలుస్తోంది.