Bharat Ratna to Ratan Tata: రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలి.. కేంద్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతితో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఆయన అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు గురువారం రోజును సంతాప దినంగా ప్రకటించాయి.
భారత రత్న పురస్కారమే సరైన గౌరవం
ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగంలో రతన్ టాటా ఎలా ఎదిగారో, అలాగే మానవతా వాదిగా దేశానికి అందించిన సేవలు అమోఘం. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భారత రత్న ఇవ్వాలని తీర్మానించింది. ఆయన సేవలకు సరైన గుర్తింపు ఇస్తూ, ఈ పురస్కారం అందించాలనే తీర్మానం మహారాష్ట్ర మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని త్వరలోనే కేంద్రానికి పంపనుంది.
సామాజిక సేవకుడు
రతన్ టాటా వ్యాపారవేత్తగానే కాకుండా, సమాజ సంక్షేమం కోరుకునే మహానుభావుడని తీర్మానంలో పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనతో దేశాభివృద్ధిలో భాగమయ్యి, దేశభక్తి చాటిన వ్యక్తిగా ఆయన్ను కీర్తించారు. ఆయనను సామాజిక సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వ్యాపారం చేసే పారిశ్రామికవేత్తగా, ప్రజల సంక్షేమం కోసం సేవ చేసే నాయకుడిగా అభివర్ణించారు. సమాన ఆలోచనలు కలిగిన సామాజిక సేవకుడిని, దూరదృష్టి కలిగిన నాయకుడిని కోల్పోయినట్లు మహారాష్ట్ర మంత్రిమండలి తెలిపింది. భారతదేశ పారిశ్రామిక రంగంలో మాత్రమే కాకుండా, సామాజిక అభివృద్ధిలో కూడా ఆయన సాయం అపారమైనదని పేర్కొంది. ఆయన స్వీయ క్రమశిక్షణ, ఉన్నత నైతిక విలువలు, ప్రజల మనిషిగా ఉన్న తీరు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉంటాయని అన్నారు.
దేశం ఎప్పటికి మర్చిపోని ముద్దుబిడ్డ
టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెట్‌జీ టాటాకి ముని మనవడు రతన్ టాటా. ఆయన టాటా గ్రూప్‌కి చైర్మన్‌గా, తాత్కాలిక చైర్మన్‌గా సేవలందించారు. టాటా గ్రూప్ ఛారిటబుల్ ట్రస్ట్‌కు అధిపతిగా ఉంటూ, దేశానికి, ప్రజలకు అనేక విధాలుగా మద్దతు అందించారు. రతన్ టాటా పాటించిన విలువలు, ఆయన కంపెనీని నడిపిన తీరు భావితరాలకు గొప్ప పాఠం.
దేశానికి అసమాన సేవలు
రతన్ టాటా సేవలు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందాయి. టాటా బ్రాండ్‌ను ఉప్పు నుంచి ఉక్కు వరకు, కంప్యూటర్ల నుంచి కాఫీ-టీ వరకు ప్రతీ ఇంటికి తీసుకెళ్లారు. విద్య, ఆరోగ్యం, సామాజిక సేవా రంగాల్లో కూడా విశేషంగా సేవలందించారు. 26/11 ముంబై దాడుల తర్వాత ఆయన చూపిన దృఢత్వం, కోవిడ్ సమయంలో ప్రధాని సహాయ నిధికి ఇచ్చిన విరాళం వంటి అనేక సంఘటనలు ఆయన గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. కోవిడ్ రోగులకు తమ హోటళ్లలో వైద్య సేవలు అందించి ఆయన మహోన్నతుడని నిరూపించారు. అందుకే,రతన్ టాటా భౌతికంగా దూరమైనప్పటికీ, ప్రతి మనిషి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి గొప్ప వ్యక్తికి భారతరత్న పురస్కారం అందించాలనే మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.