
TG News:ఎండలు మండుతున్నా.. రాష్ట్రంలో పడిపోయిన విద్యుత్ డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
ఎండలు భగ్గుమంటున్నా.. తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పడిపోయింది.
ముఖ్యంగా వరి కోతలు ముగియడంతో వ్యవసాయ బోర్ల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది.
రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా రోజువారీ విద్యుత్ వినియోగం గత నెల 20న 17,162 మెగావాట్లకు చేరగా, నెల రోజుల తర్వాత ఈ నెల 20న (ఆదివారం) అది కేవలం 10,245 మెగావాట్లకే పరిమితమైంది.
అంతేకాదు, ఆదివారం రాత్రి ఈ డిమాండ్ 8 వేల మెగావాట్లకు తగ్గిపోయింది. పంటల సాగు లేకపోవడం, పరిశ్రమలకు సెలవు దినం కావడంతో విద్యుత్ వినియోగం తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని డిస్కంల వర్గాలు వివరించాయి.
వినియోగం తగ్గిపోవడంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిస్తున్నారు.
ఈ ఉత్పత్తి తగ్గింపును 'బ్యాక్‌డౌన్'గా వ్యవహరిస్తారు.
వివరాలు
బ్యాక్‌డౌన్ వెనక కారణాలు
రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాలు పగటిపూట ఎక్కువగా బ్యాక్‌డౌన్ అవుతున్నట్లు కేంద్ర విద్యుత్ మండలి, జెన్‌కో వర్గాలు పేర్కొన్నాయి.
తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ఖర్చు యూనిట్‌కు రూ.4 నుంచి రూ.6 వరకు ఉంటుంది.
ఇదే సమయంలో పగటిపూట సౌర విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉండటం, అలాగే భారత ఇంధన ఎక్స్ఛేంజ్ ద్వారా యూనిట్ కరెంట్ రూ.2 నుండి రూ.3 మధ్యలో లభించడం వల్ల థర్మల్ కేంద్రాల ఉత్పత్తిని తగ్గిస్తున్నారు.
తక్కువ ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర విద్యుత్ సరఫరా ఖర్చు గణనీయంగా తగ్గుతోందని డిస్కంలు చెబుతున్నాయి.
వివరాలు
60 శాతం బ్యాక్‌డౌన్ సాధ్యమేనా?
సౌర విద్యుత్ ఉత్పత్తి పెరుగుదల, ఎక్స్ఛేంజ్‌లో తక్కువ ధరలకు విద్యుత్ లభ్యం కావడం కారణంగా కేంద్ర విద్యుత్ శాఖ,రాష్ట్రాల జెన్‌కోలకు బ్యాక్‌డౌన్ పరిమితిని పెంచాలని సూచించింది.
ప్రస్తుతం గరిష్ఠ బ్యాక్‌డౌన్ పరిమితి 45 శాతంగా ఉండగా, దాన్ని 60 శాతానికి పెంచాలని సూచించింది.
అంటే ప్లాంట్ గరిష్ఠంగా 40 శాతం ఉత్పత్తి మాత్రమే చేయాలి అనే అర్థం.
మొదటి దశలో ప్రయోగాత్మకంగా భద్రాద్రి,కొత్తగూడెం థర్మల్ ప్లాంట్లను 800 మెగావాట్ల సామర్థ్యంతో 40 శాతం ఉత్పత్తిపై నడపాలని నిర్ణయించారు.
వివరాలు
కూలింగ్ కోసం ఉపయోగించే నీటి వినియోగంలో మార్పులు
అయితే, ఈ ప్లాంట్లు కనీసం 55 శాతం ఉత్పత్తి శాతంతో నడిచేలా రూపొందించబడ్డాయి.
దీంతో 45 శాతం బ్యాక్‌డౌన్‌కు మించి తగ్గించడం సాంకేతికంగా కష్టసాధ్యమైంది.
కేంద్ర ఆదేశాల మేరకు భద్రాద్రి ప్లాంట్‌ను 40 శాతానికి ఉత్పత్తి తగ్గించి నడిపినప్పుడు, అనేక సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు విశ్వసనీయ సమాచారం చెబుతోంది.
ఉత్పత్తి స్థాయి తగ్గినపుడు బొగ్గు మండడంలో అసమానతలు, కూలింగ్ కోసం ఉపయోగించే నీటి వినియోగంలో మార్పులు కనిపించాయి.
ఇలా కొనసాగితే ప్లాంట్ ధ్వంసమయ్యే ప్రమాదం ఉండటంతో మళ్లీ ఉత్పత్తిని 55 శాతానికి పెంచారు.
వివరాలు
బ్యాక్‌డౌన్ పరిమితిని 55 శాతం
జెన్‌కో అధికారులు భద్రాద్రి ప్లాంట్‌ను నిర్మించిన భెల్ ఇంజినీర్లను సంప్రదించగా, 40 శాతం ఉత్పత్తికి తగిన మార్పులు చేయాలంటే రూ.100 కోట్లు ఖర్చవుతుందని వారు అంచనా వేశారు.
అలాగే కొత్తగూడెం, భూపాలపల్లి ప్లాంట్లలోనూ ఇదే తరహాలో అదనపు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆదేశాలను అమలు చేయడం కష్టమని గుర్తించి, బ్యాక్‌డౌన్ పరిమితిని 55 శాతంగా కొనసాగిస్తున్నారు.