Page Loader
AP Transco: రూ.28 వేల కోట్లతో ట్రాన్స్‌కో నెట్‌వర్క్‌.. ఐదేళ్ల తర్వాత పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా విస్తరణ
ఐదేళ్ల తర్వాత పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా విస్తరణ

AP Transco: రూ.28 వేల కోట్లతో ట్రాన్స్‌కో నెట్‌వర్క్‌.. ఐదేళ్ల తర్వాత పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా విస్తరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2025
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

రాయలసీమ నుండి కాకినాడ వరకు ట్రాన్స్‌కో నెట్‌వర్క్ సామర్థ్య విస్తరణ (ఆగ్‌మెంటేషన్) కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సూచనాత్మకంగా అంగీకారం తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రాజెక్టు నివేదికలోని కొన్ని అంశాలపై స్పష్టత కోసం అధికారులు వివరణను సమర్పించారు. రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే అమలులో ఉన్న,రాబోయే రోజుల్లో ఏర్పాటు కాబోయే సౌర,వాయు, ఇతర పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు,అలాగే పంప్డ్ స్టోరేజి,బ్యాటరీ స్టోరేజి సౌకర్యాల నుంచి అందే విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగించేందుకు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో లైన్ల సామర్థ్యం పెంచేందుకు రాష్ట్ర ఇంధన శాఖ కేంద్రానికి రూ.28,000 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీనిలో 60 నుండి 80 శాతం నిధులను కేంద్రం సమకూర్చాలని అభ్యర్థించింది.

వివరాలు 

ఐదేళ్లలో విద్యుత్ డిమాండ్‌ 20,000 మెగావాట్లు 

ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు లభించినట్లయితే, పూర్తి చేయడానికి కనీసం ఐదు సంవత్సరాల సమయం పడే అవకాశం ఉంది. హరిత ఇంధన ప్రోత్సాహం లక్ష్యంగా గ్రీన్ ఎనర్జీ కారిడార్ పథకం కింద నెట్‌వర్క్ విస్తరణకు కేంద్రం నిధులు ఇస్తోంది. మొదటి దశలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రత్యేక లైన్లు, సబ్‌స్టేషన్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రెండో దశలోని పనులు పూర్తయితే ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ మరింత బలపడుతుంది. దీని వల్ల రాయలసీమ, కోస్తా మధ్య బలమైన విద్యుత్‌ అనుసంధానం ఏర్పడుతుంది. ప్రస్తుతం విద్యుత్ సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పీవీజీసీఐఎల్ (PGCIL) నెట్‌వర్క్‌పై ఆధారపడుతున్నాయి.

వివరాలు 

ఏడాదికి విద్యుత్ వినియోగం 1.20 లక్షల మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం 

దాదాపు 8,000 మెగావాట్ల విద్యుత్‌ను డిస్‌ప్లేస్‌మెంట్ విధానంలో పీజీసీఐఎల్ నెట్‌వర్క్‌కు జత చేస్తూ, తమిళనాడుకు తరలిస్తున్నారు. అదే సమయంలో ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే విద్యుత్‌ను విశాఖపట్నం వద్ద నెట్‌వర్క్ ద్వారా తీసుకుంటున్నారు. 2030-32 నాటికి రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 20,000 మెగావాట్లకు చేరుతుందని అంచనా. ఏడాదికి విద్యుత్ వినియోగం 1.20 లక్షల మిలియన్ యూనిట్లకు చేరే అవకాశముంది. ఆ సమయంలో నెట్‌వర్క్ విస్తరణ లేకపోతే విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతుంది. ప్రస్తుతం పీజీసీఐఎల్ నెట్‌వర్క్ వాడుతున్నందుకు విద్యుత్ సంస్థలు సంవత్సరానికి సుమారు రూ.1,700 కోట్లు ట్రాన్స్‌మిషన్ ఛార్జీలుగా చెల్లిస్తున్నాయి. పైగా, ఇప్పటికే పీజీసీఐఎల్ నెట్‌వర్క్ సామర్థ్యానికి మించి వినియోగమవుతోంది.

వివరాలు 

భవిష్యత్తు ప్రాజెక్టుల అవసరాల కోసం బలమైన నెట్‌వర్క్ 

భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ పెరిగితే కేంద్ర నెట్‌వర్క్ వినియోగించడం వల్ల ఆల్టర్నేటివ్ కరెంట్ (ఏసీ) ఛార్జీలు మరింత భారంగా మారతాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి స్వంత నెట్‌వర్క్ విస్తరణ అవసరమని అధికారులు నిర్ధారించారు. కాకినాడ సెజ్,తూర్పుగోదావరి జిల్లా వేమగిరి వద్ద ఉన్న 400 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి సత్తెనపల్లి వరకు ఇప్పటికే నెట్‌వర్క్‌ అందుబాటులో ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి గుడివాడ, అనంతరం రామాయపట్నం వరకు విస్తరించాలన్నది అధికారులు యోచన. రామాయపట్నంలో కొత్త పోర్టు,బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారం,ఇండోసోల్ వంటి భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో విద్యుత్ అవసరాల కోసం నెట్‌వర్క్ మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.

వివరాలు 

హిందుజా-గుడ్డిగూడెం మధ్య 400 కేవీ లైన్‌

రామాయపట్నం నుంచి అనంతపురం జిల్లా వరకు నెట్‌వర్క్‌ను కలిపే ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా మినహా మిగతా ప్రాంతాలన్నీ ట్రాన్స్‌కో నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతాయి. ఈ వ్యవస్థ ద్వారా రాయలసీమలోని విద్యుత్ ఉత్పత్తిని అవసరమైన చోటుకు తరలించవచ్చు. కాకినాడ నుంచి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల మధ్య ఇప్పటికే ట్రాన్స్‌కో నెట్‌వర్క్‌ ఉంది. హిందుజా-గుడ్డిగూడెం మధ్య 400 కేవీ లైన్‌ ఏర్పాటై ఉంది. గుడ్డిగూడెం వద్ద కొత్త సబ్‌స్టేషన్‌ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి కాకినాడ సెజ్‌ను 'లూప్ ఇన్ - లూప్ అవుట్ (లిలో)' పద్ధతిలో కలుపుతారు. కల్పాక నుంచి విజయనగరం జిల్లాలోని మరడం 400 కేవీ సబ్‌స్టేషన్‌కి అనుసంధానం ఉంది.

వివరాలు 

 17 సబ్‌స్టేషన్ల అనుసంధాన ప్రణాళిక 

ట్రాన్స్‌కోకు చెందిన ఆస్పరి, కృష్ణపట్నం, పొదిలి, రామాయపట్నం, సత్తెనపల్లి, వేమగిరి, గుడివాడ, కాకినాడ, గంగవరం, నక్కపల్లి - మొత్తంగా 17 సబ్‌స్టేషన్లను అనుసంధానించనున్న ప్రణాళిక ఉంది. ఈ కారణంగా ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తినా ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి వీలుంటుంది. అలాగే ఏలూరు సమీపంలోని కొప్పాక వద్ద 400 కేవీ సబ్‌స్టేషన్‌ను కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఉంది.

వివరాలు 

గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు రాయలసీమ విద్యుత్ వినియోగం 

విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ పార్కును ఎన్టీపీసీ మరియు జెన్‌కో సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి. ఇక్కడ రూపొందించబోయే గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులకు అవసరమైన పునరుత్పాదక విద్యుత్‌ను రాయలసీమలో ఏర్పాటు చేసే ప్రాజెక్టుల నుంచి పొందే అవకాశముంది.