Car Overturned In Begusarai: హోలీ పండుగ రోజు విషాదం.. కారు గోతిలో బోల్తా పడి కుటుంబంలోని ముగ్గురు మృతి
బిహార్ లోని బెగుసరాయ్‌లో హోలీ రోజున పెను ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి గుంతలో బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందగా, ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో తల్లి, కూతురు,మరో మహిళ ఉన్నారు.గాయపడిన వారిలో తండ్రి,కొడుకు,డ్రైవర్ ఉన్నారు. ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బచ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝమ్తియా NH 28 సమీపంలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఓ కుటుంబం హోలీ సందర్భంగా ముజఫర్‌పూర్ నుంచి జాముయికి కారులో వెళుతుండగా కారు అదుపు తప్పి గుంతలో బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బచ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం
మృతులను ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన సుధీర్ కుమార్ భార్య అర్చన దేవి, వారి కుమార్తె నమ్రత కుమారి, మరో మహిళగా గుర్తించారు. వారంతా దల్సింగ్‌సరాయ్ నుంచి బెగుసరాయ్ వైపు కారులో వెళ్తున్నారని ప్రత్యక్ష సాక్షి అమర్జీత్ యాదవ్ తెలిపారు. ఇదే సంఘటన గురించి కుటుంబ సభ్యుడు గౌతమ్ కుమార్ మాట్లాడుతూ, ముజఫర్‌పూర్ నుండి కారులో జాముయికి వెళుతుండగా బచ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో తల్లి, కూతురు, ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సదర్ ఆస్పత్రికి తరలించారు.