Bengaluru Bomb Blast: బెంగళూరు పేలుడు ఘటనలో కీలక పరిణామం.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడి గుర్తింపు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన ఒక రోజు తర్వాత,కర్ణాటక రాజధానిలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని కేఫ్ ప్రాంగణంలో ఒక వ్యక్తి బ్యాగ్‌తో వెళ్తున్నట్లు చూపించే CCTV ఫుటేజీ బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,నిందితుడు,ఓ బ్యాగ్‌ను కేఫ్‌లో ఉంచి, పేలుడు జరగడానికి ముందు వెళ్లిపోయాడు. అనుమానితుడితో పాటు కనిపించిన మరో వ్యక్తిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన నిందితుడు, అతని ముఖాన్ని ముసుగు,అద్దాలు,తలను టోపీతో దాచిపెట్టి,ఇడ్లీల ప్లేట్‌తో కేఫ్‌లో సీసీ కెమెరాలలో కనిపించాడు. శుక్రవారం మధ్యాహ్నం 12.50 నుంచి 1 గంటల మధ్య జరిగిన ఈ పేలుడు ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి.
నిందితుడిని గుర్తించినట్టు తెలిపిన డిప్యూటీ సీఎం
ఘటనాస్థలికి చేరుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ క్షుణ్ణంగా విచారణ చేపట్టారు.కేఫ్ సిబ్బందితో సహా గాయపడిన వారు ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను రాజకీయం చేయవద్దని,ప్రస్తుతం జరుగుతున్నవిచారణకు సహకరించాలని,కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజలను కోరారు.ఐఈడీ కారణంగా ఈపేలుడు సంభవించి ఉండవచ్చని అయన మీడియాకు తెలిపారు. హోంమంత్రి జి పరమేశ్వరతో కలిసి పేలుడు ప్రదేశాన్ని సందర్శించిన ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ పేలుడుకు దారితీసిన సంఘటనల క్రమం గురించి కీలకమైన వివరాలను అందించారు. "మధ్యాహ్నం 1 గంటలకు పేలుడు సంభవించింది.సుమారు 28-30సంవత్సరాల యువకుడు కేఫ్‌కు వచ్చి,కౌంటర్‌లో రవ్వ ఇడ్లీ కోసం కూపన్ తీసుకున్న నిందితుడు అది తినకుండానే తన బ్యాగ్‌ను అక్కడ వదిలేసి వెళ్లిపోయాడని..ఒక గంట తర్వాత పేలుడు సంభవించింది" అని శివకుమార్ చెప్పారు.
దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సిసిబి
సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) దర్యాప్తు బాధ్యతలు చేపట్టింది. ఫోరెన్సిక్ బృందాలు ప్రస్తుతం ఘటనాస్థలిని పరిశీలించి సాక్ష్యాలను సేకరించి, ఉపయోగించిన పేలుడు పరికరం స్వభావాన్ని నిర్ధారించారు. NSG కమాండోలు, బాంబ్ స్క్వాడ్‌లు నేటి ఉదయం కూడా ఆ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నారు.