Bengaluru Rains: బెంగళూరులో కుండపోత వర్షంతో రహదారులు జలమయం.. ఎడతెగని వానతో కడగండ్లు
బెంగళూరు ఉద్యాననగరిలో బుధవారం ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రానికి పూర్తిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడడంతో రహదారులు జలమయంగా మారాయి. విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లాల్సిన ఉద్యోగులు, కళాశాలల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయిలేఅవుట్, టాటానగర, సిల్కుబోర్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారులు నదుల్లా మారాయి. యలహంక, కేంద్రీయ విహార్, సాయి లేఅవుట్, టాటానగర వంటి ప్రాంతాల్లో ఈ విపత్తును ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పరిశీలించారు. గత 120 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
కెంగేరి చెరువులో మునిగిన అన్నాచెల్లెళ్ళ కుటుంబానికి రూ. 5 లక్షలు
విపత్తు నిర్వహణతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాజకాలువపై కబ్జాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రీయ విహార్‌ను ఖాళీ చేయాలని సూచించినప్పటికీ, ఐదు శాతం మంది ఇప్పటికీ పైఅంతస్తులో ఉన్నారని ఆయన గుర్తించారు. వారికి అవసరమైన సదుపాయాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని శివకుమార్ తెలిపారు. కెంగేరి చెరువులో మునిగి మరణించిన అన్నా చెల్లెళ్లు జాన్‌సేన, మహాలక్ష్మి కుటుంబానికి రూ. 5 లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. పాలికె తరఫున రూ. 10 లక్షలు అందిస్తామని ప్రధాన కమిషనర్ తుషార్ గిరినాథ్ తెలిపారు.
నిర్మాణంలో ఉన్న మెట్రో మార్గం వద్ద 3 అడుగుల నీరు
బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో జయనగర, బీటీఎం లేఅవుట్, సిల్కుబోర్డు, బన్నేరుఘట్ట రోడ్డు, కోరమంగల, మడివాళ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి మళ్లీ నీరు చేరింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు, కొమ్మలు విరిగిపడటంతో వాహన రాకపోకలకు ఆటంకం కలిగింది. నిర్మాణంలో ఉన్న మెట్రో మార్గం వద్ద 3 అడుగుల నీరు నిలిచింది. వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఎలుకలు, పాములు ఇళ్లలోకి రావడం వంటి ఫిర్యాదులు ప్రజల నుంచి వచ్చాయి. హొరమావు ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరడంతో నష్టాన్ని ఎదుర్కొన్న నివాసులకు తలా రూ. 10 వేల పరిహారం ఇస్తామని శివకుమార్ ప్రకటించారు.
కొనసాగుతున్న వర్షాలు
బెంగళూరు, బెంగళూరు గ్రామీణం, చిక్కబళ్లాపుర, హాసన, కొడగు, కోలారు, మండ్య, రామనగర, శివమొగ్గ, తుమకూరు తదితర జిల్లాల్లో గురువారం సాయంత్రం వరకు ఎల్లో అలర్ట్ ఉండనుంది అని భారతీయ వాతావరణ శాఖ ప్రకటించింది. బెంగళూరులో వర్షం కురుస్తున్న సమయంలో చెట్లు, పెద్ద స్తంభాల వద్ద నిలబడవద్దని, వాహనాలను నిలిపివద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు బెంగళూరులో 23.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. హుబ్బళ్లి వద్ద కాలువపైకి వరద నీరు రావడంతో నాగరాజ దేవణ్ణవర అనే వ్యక్తి తన కారుతో సహా కొట్టుకుపోయాడు. స్థానికులు స్పందించి అతన్ని రక్షించారు. భారీ వర్షం కురుస్తున్న సమయంలో కాలువలు, నదుల వద్దకు వెళ్లవద్దని ఆయా జిల్లా పాలనా యంత్రాంగాలు స్థానికులను హెచ్చరించాయి.
ధ్వంసరచన
గాలి, వాన కారణంగా ఉద్యాననగరిలో వృక్షరాజాలు విలవిలలాడుతున్నాయి. వీవీపురం పరిధి నెటెకలప్ప కూడలిలో బుధవారం ఉదయం ఒక భారీ వృక్షం నేలకొరిగింది. చెట్టు కొమ్మలు పడి దాని కింద నిలిపిన కార్లు ధ్వంసమయ్యాయి. చెట్టు పాదు దగ్గర పాదచారి మార్గం ఉండడం, వేళ్లలోకి నీరు చేరుకుని, అది విరిగి పడిందని గుర్తించారు.