Page Loader
'గుర్బానీ' ఉచిత టెలికాస్ట్ నిర్ణయంపై పంజాబ్‌లో వివాదం
'గుర్బానీ' ఉచిత టెలికాస్ట్ నిర్ణయంపై పంజాబ్‌లో వివాదం

'గుర్బానీ' ఉచిత టెలికాస్ట్ నిర్ణయంపై పంజాబ్‌లో వివాదం

వ్రాసిన వారు Stalin
Jun 19, 2023
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ నుంచి గుర్బానీని అందరికీ ఉచితంగా ప్రసారం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ ప్రభుత్వం సిక్కు గురుద్వారా చట్టం, 1925ను సవరించనున్నట్లు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. గుర్బానీ అనేది ఒక పవిత్రమైన శ్లోకం. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో పఠించే ఈ శ్లోకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు భక్తితో వింటారు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్ మాత్రమే గుర్బానీని ప్రసారం చేసేందుకు హక్కులను పొందింది. ఎంతో పవిత్రమైన ఈ శ్లోకాన్ని ఒక ఛానెల్‌కు మాత్రమే పరిమితం చేయకుండా, సర్వజన సంక్షేమ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని సీఎం మాన్ అన్నారు. అందుకే 'సర్బ్ సంజీ గుర్బానీ'ని ప్రచారం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

పంజాబ్

జూన్ 20న గుర్బానీ ఉచిత టెలికాస్ట్‌పై తీర్మానం

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం జూన్ 20న ప్రత్యేక సెషన్‌లో గుర్బానీ ఉచిత టెలికాస్ట్‌పై అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టనుందని సీఎం మాన్ ప్రకటించారు. భక్తులందరి డిమాండ్ మేరకు, అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ హర్మీందర్ సాహిబ్ నుంచి గుర్బానీని ఉచితంగా ప్రసారం చేయడానికి గురుద్వారా చట్టం 1925లో కొత్త నిబంధనను చేర్చబోతున్నట్లు వెల్లడించారు. దీనికి ఇక మీదట ఎలాంటి టెండర్ అవసరం లేదన్నారు. విదేశాల్లో ఉన్నా ఇంట్లో కూర్చొని గుర్బానీని వినడానికి 'సంగత్'కు అవకాశం కల్పించడంలో ఈ చర్య చాలా దోహదపడుతుందని సీఎం మాన్ అన్నారు. ప్రజలు తమ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో కూడా శ్రీ హర్మందర్ సాహిబ్ గుర్బానీని వినొచ్చని ముఖ్యమంత్రి చెప్పారు.

పంజాబ్

పంజాబ్ ప్రభుత్వానికి చట్టాన్ని సవరించే హక్కు లేదు: ఎస్‌జీపీసీ

ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీసుకున్న నిర్ణయంపై సిక్కుల అత్యున్నత మత సంస్థ శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(ఎస్‌జీపీసీ) తీవ్రంగా స్పందించింది. మతపరమైన విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని కోరింది. పంజాబ్ ప్రభుత్వానికి ఈ చట్టాన్ని సవరించే హక్కు లేదని ఎస్‌జీపీసీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామీ ట్వీట్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని గందరగోళానికి గురి చేయవద్దన్నారు. సిక్కుల మతపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవద్దన్నారు. సిక్కు వ్యవహారాలు సంగత్‌ల మనోభావాలకు సంబంధించినవని, ప్రభుత్వాలకు నేరుగా జోక్యం చేసుకునే హక్కు లేదన్నారు.