LOADING...
Bhogapuram Airport: శరవేగంగా  భోగాపురం విమానాశ్రయం పనులు.. 2026 జూన్‌కు సిద్ధం
శరవేగంగా భోగాపురం విమానాశ్రయం పనులు.. 2026 జూన్‌కు సిద్ధం

Bhogapuram Airport: శరవేగంగా  భోగాపురం విమానాశ్రయం పనులు.. 2026 జూన్‌కు సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2025
08:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల త్వరలోనే సాకారం కానుంది. విజయనగరం జిల్లాలోని భోగాపురంలో నిర్మాణంలో ఉన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2026 జూన్‌ కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీఎంఆర్ సంస్థను ఆదేశించారు. దీంతో గడువు కంటే ముందే విమానాశ్రయాన్ని వినియోగానికి తీసుకురావడమే లక్ష్యంగా సంస్థ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టును జీఎంఆర్‌ తరఫున ఎల్‌అండ్‌టీ అమలు చేస్తోంది. కూటమి ప్రభుత్వమే అధికారం చేపట్టే నాటికి కేవలం 31.80% పనులు మాత్రమే పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు జూలై చివరినాటికి 84% పనులు పూర్తి చేయడం విశేషం.

వివరాలు 

రోడ్ల విస్తరణ - 15 మార్గాలకు రూ.390 కోట్లు 

విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు చేరుకోవడానికి కేవలం 45నిమిషాల ప్రయాణ సమయం మాత్రమే పడేలా బీచ్ కారిడార్ ప్రతిపాదన వైకాపా పాలనలో రూపుదిద్దుకున్నప్పటికీ, అది కాగితాలకే పరిమితమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్తోంది. విశాఖ పోర్టు నుంచి భీమిలి మీదుగా,మూలకొద్ది వద్ద గోస్తనీ నదిపై వంతెన నిర్మాణం చేసి,ఎయిర్‌పోర్టు చేరుకునేలా ప్రణాళిక సిద్ధమైంది. దీని కోసం రూ.2,800 కోట్ల డీపీఆర్ పూర్తయింది. విమానాశ్రయం ఇంకో పది నెలల్లో సిద్ధం కానుండటంతో,దానికి అనుగుణంగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు. అదనంగా,విమానాశ్రయానికి కనెక్టివిటీ పెంచేలా 15 అంతర్గత రహదారులను విస్తరించాలని విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(VMRDA)నిర్ణయించింది. ఇవన్నీ నాలుగు వరుసల రహదారులుగా మార్చితే ప్రయాణం మరింత సులభం అవుతుంది.

వివరాలు 

ప్రధానంగా విస్తరించబోయే మార్గాలు: 

విజయనగరం రింగ్‌రోడ్డు-అయినాడ కూడలి, శొంఠ్యాం-అడవివరం, దొరతోట, కాపులుప్పాడ, మద్దిలపాలెం, బోయపాలెం, షీలానగర్. వీటన్నింటికీ కలిపి రూ.390 కోట్లు కేటాయించారు. ఈ 15 రోడ్లలో అత్యంత ప్రాధాన్యమైన 7 మార్గాలను 2026 జూన్‌కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటి కోసం రూ.174.64 కోట్లతో టెండర్లు పిలిచారు.

వివరాలు 

రూ.1,600 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్లు 

విశాఖ నగర శివారు నుంచి కొమ్మాది వరకు 12 కూడళ్లలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని తగ్గించడానికి నాలుగు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించనున్నారు. వాటిలో అగనంపూడి-లంకెలపాలెం, స్టీల్ ప్లాంట్-బీహెచ్ఈఎల్, సత్యం కూడలి-హనుమంతువాక, మధురవాడ క్రీడా మైదానం-కొమ్మాది మార్గాలు ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1,600 కోట్లుగా అంచనా వేశారు. ఈ పనులు గడువు లోపే పూర్తవుతాయని విజయనగరం జిల్లా కలెక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిరంతరం ఈ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తున్నారని తెలిపారు.

వివరాలు 

రెండు దశల్లో నిర్మాణం 

మొదటి దశ ఖర్చు: రూ.4,592 కోట్లు ఏరో బ్రిడ్జ్‌లు: 22 టెర్మినల్ బిల్డింగ్ విస్తీర్ణం: 81 వేల చదరపు మీటర్లు భూవిస్తీర్ణం: 2,203 ఎకరాలు + అదనంగా 500 ఎకరాలు కేటాయింపు రన్‌వేలు: 2 (ప్రతి ఒక్కటి 3.8 కి.మీ. పొడవు) ఏటా ప్రయాణికుల రాకపోకలు: ఆరంభంలో 60 లక్షలు - తర్వాత దశలవారీగా 4 కోట్లకు పెంపు ముఖ్య జోన్లు: ఏరోస్పేస్, ఇండస్ట్రియల్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ అనుబంధ విభాగాలు: ఏరో సిటీ, విడిభాగాల తయారీ పరిశ్రమలు, ఆరోగ్య-అతిథి రంగాల అభివృద్ధి రెండవ దశ నిర్మాణం ప్రారంభం: 2030