Rammohan Naidu: 2026 జూన్ కల్లా భోగాపురం విమానాశ్రయం సిద్ధం: రామ్మోహన్ నాయుడు
శంషాబాద్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి వెనుక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి కీలకమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. అప్పట్లో 5 వేల ఎకరాల భూసేకరణ సాధించడంలో ఆయన పాత్ర సామాన్య విషయం కాదని గుర్తు చేశారు. శంషాబాద్ నోవాటెల్‌లో నిర్వహించిన ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఆయన, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల కాన్సెప్ట్ వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో ఐటీ విప్లవానికి ఆయన చేసిన కృషి దేశాభివృద్ధికి చోదకశక్తిగా నిలిచిందని, ఇప్పటికీ చంద్రబాబు ఐటీని అభివృద్ధి హేతువుగా నమ్ముతారని తెలిపారు. విమానాశ్రయాల నిర్వహణలో అత్యున్నత సాంకేతికతను ఉపయోగించి సేవలు మెరుగుపరుస్తున్నామని, డేటా అనలిటిక్స్ ఉపయోగించి సరికొత్త సేవలను అందిస్తున్నామని వివరించారు.
24 విమానాశ్రయాల్లో డిజియాత్ర టెక్నాలజీ
అదే విధంగా, దేశంలోని 24 విమానాశ్రయాల్లో డిజియాత్ర టెక్నాలజీ అమలు చేస్తున్నామని, విమానాశ్రయాలను కేవలం రవాణా సౌకర్యాలు మాత్రమే కాకుండా ఉపాధి మార్గాలు, సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో విమానయాన శాఖ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచం భారత్ వైపు చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వరంగల్, భోగాపురం విమానాశ్రయాలను త్వరలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి అవుతుందని, వచ్చే ఐదేళ్లలో 50 విమానాశ్రయాలను పెంచడమే లక్ష్యమని చెప్పారు. ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభం మరో మైలురాయి అని ఆయన పేర్కొన్నారు.