Hathras : పవిత్ర జలం పేరుతో భక్తులకు నీళ్లు ప్రసాదం..ఎగబడి ప్రాణాలు కోల్పోయిన 116 మంది.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ?
ఉత్తర్‌ప్రదేశ్ లోని మంగళవారం హత్రాస్‌లో జరిగిన "సత్సంగం"లో విపరీతమైన రద్దీ, విపరీతమైన తేమ, జారే నేల, భోలే బాబా ఆశీర్వాదం పొందలేదని నిరాశ, గందరగోళం, అరుపులు , భయం. ఇవన్నీ పెద్ద సంఖ్యలో మరణాలకు దారి తీశాయి.
అసలు ఏమి జరిగిందంటే
అప్పటిదాకా ఆధ్యాత్మిక శోభతో పులకరించిన ఆ ప్రాంతం క్షణాల్లో ఒక్కసారిగా శోక సముద్రంగా మారిపోయింది. ప్రవచనాలు వినేందుకు వచ్చిన భోలే బాబా భక్తులు విగతజీవులయ్యారు. కొద్దిసేపటి క్రితం దాకా తమతోనే ఉండి... అంతలోనే అనంతలోకాలకెళ్ళిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక కుటుంబాల్లో పెను విషాదం నింపింది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో మృత్యు ఘోష వినిపించింది. భక్తులు ఒక్కసారిగా ఏగబడటంతో తోపులాటకు దారితీసి.. ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో ఊపిరాడక ప్రాణాలు116 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది..
బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునే యత్నం వికటించి తొక్కిసలాట
హత్రాస్ జిల్లా సికందరరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని రతిభాన్‌పుర్‌లో బాబా సత్సంగ్ శివారాధన కార్యక్రమ సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ కార్యక్రమంలో పవిత్ర జలం పేరుతో భక్తులకు నీళ్లు ప్రసాదం గా ఇస్తారు. ఈ జలం స్వీకరిస్తే సర్వరోగాలు పోయాయని నమ్మకం. దీంతో దేశం నలుమూలల నుంచి దాదాపు 4లక్షల మంది వరకూ హాథ్రాస్ చేరుకున్నారు. బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో మధ్యాహ్నం వేళ ఈ తొక్కిసలాట జరిగింది. దాంతో ఊపిరాడక అనేక మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ప్రాణాలు కోల్పోయారు. రతిభాన్పూర్ సత్సంగ్ కార్యక్రమంలో విషాదంపై యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
పూరి గుడిసె నుంచి భోలే బాబా ఎదిగిన క్రమం ఇలా వుంది
భోలే బాబా అసలు పేరు సూరజ్ పాల్.ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లడానికి ముందు, అతను పోలీసు విభాగంలో ఇంటెలిజెన్స్ యూనిట్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేశాడు. కళాశాల విద్య తర్వాత ..బాబా ఇంటెలిజెన్స్ బ్యూరో లో పని చేసినట్లు తెలుస్తుంది. 1999లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని హరిగా పేరు మార్చుకున్నాడు. అతగాడి ఆధ్యాత్మిక ప్రయాణం సొంత గ్రామమైన బహదూర్ నగరిలో ప్రారంభమైంది. అక్కడ అతను ఒక గుడిసెలో నివసించేవాడని స్ధానికులు చెపుతారు .
సింహాసనం లాంటి ఎత్తైన కుర్చీపై బోలే బాబా
ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో తన ఆధ్యాత్మిక ప్రచారం నిర్వహించాడు. దీనితో ఆయనకు విశేషమైన ఫాలోయింగ్ మొదలైంది. చాలా మంది స్వీయ-శైలి దేవుళ్ళలా కాకుండా, హరి తరచుగా తెల్లటి సూట్ , టై , సాధారణ కుర్తా పైజామా ధరించి సత్సంగాలకు హాజరు అయ్యేవాడు. అతగాడి భార్య ప్రేమ్ బటి కూడా కలిసి భక్తులకు కనిపించేది.ఈ సమావేశాల సమయంలో అతను సింహాసనం లాంటి ఎత్తైన కుర్చీపై కూర్చుంటాడు. కొన్నిసార్లు అతని భార్య కూడా ఇదే కుర్చీపై కూర్చునేది.. ఈ ఈవెంట్‌లను అతని అనుచరులు నిర్వహిస్తారు. వారు ఎక్కువగా లేత గులాబీ రంగు చొక్కాలు, ప్యాంటు , తెల్లటి టోపీలు ధరిస్తారు.
40 లక్షలమంది హాజరైతే భద్రతా చర్యలు పూజ్యం
ఇదిలా వుంటే కరోనా సమయంలో బోలో బాబా ఇచ్చే నీరుతో తమకు ఉపశమనం లభించిందని ఆయన భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి మంగళవారం హత్రాస్ లో నిర్వహించే ఈ సత్సంగానికి దేశం నలు మూలలనుంచి భారీగా హాజరు అవుతారు. నిన్నటి సమావేశానికి దాదాపుగా 40 లక్షలమంది హాజరై వుంటారని ప్రాధమిక అంచనాగా వుంది. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంటే జిల్లా పాలనా యంత్రాగం చేష్టలుడిగి చూస్తూ వుండిపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయిు. కాగా హత్రాస్ తొక్కిసలాట ఘటన ఎఫ్‌ఐఆర్‌లో భోలే బాబా పేరు లేదు. మరణించిన 121 మంది వారి పేర్లు లేకపోవటం గమనార్హం.