Amarinder Singh Raja: ఎన్నికల కోసం బీజేపీ ఏమైనా చేయగలదు; పూంచ్ ఉగ్రదాడిపై ప్రశ్నలు
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తర్వాత మరో కాంగ్రెస్ నాయకుడు, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ తాజాగా పూంచ్ ఉగ్రదాడిపై అధికార బీజేపీని టార్గెట్ చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ ఏమైనా చేయగలదని అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, "పుల్వామా దాడి ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయిందన్నారు. దీనిపై అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా ప్రశ్నలు సంధించారన్నారు. అమరీందర్ సింగ్ రాజా లూథియానా స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.
భారత వైమానిక దళానికి చెందిన వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి
2019 ఫిబ్రవరిలో జైషే మహ్మద్ చేసిన పుల్వామా దాడి లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగింది. కొన్ని రోజుల తర్వాత, భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ప్రతీకార దాడులు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ వరుసగా రెండోసారి ఎన్నికల్లో మెజారిటీ సాధించాయి. ఎన్నికల ప్రయోజనాల కోసం బిజెపి ప్రభుత్వం తీవ్రవాద దాడిని అనుమతించిందని ప్రతిపక్షాలు పదే పదే ఆరోపించాయి, ఈ అభియోగాన్ని అధికార పార్టీ తిరస్కరించింది. గత శనివారం పూంచ్‌లో దాడి జరిగింది. భారత వైమానిక దళానికి చెందిన వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక సైనికుడు వీరమరణం పొందాడు. ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతమంతా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఎన్నికలలో బీజేపీని గెలిచేందుకే ఈ విన్యాసాలు
ఈ దాడి జరిగిన ఒక రోజు తర్వాత, జలంధర్ లోక్‌సభ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ చన్నీ బిజెపి ప్రభుత్వం తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీని గెలిపించేందుకు ఇలాంటి విన్యాసాలు చేస్తున్నారు. ఇవి ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడులని, ఇందులో వాస్తవం లేదన్నారు. తన ప్రకటనపై వివాదం ప్రారంభమైన తర్వాత, మాజీ సీఎం వెనక్కి తగ్గారు.
బీజేపీ రాజకీయ స్టంట్
దేశాన్ని రక్షించేందుకు సాయుధ దళాల్లో చేరిన సైనికులను చూసి తాను గర్విస్తున్నానని అన్నారు. పుల్వామా ఘటనకు పాల్పడిన నేరస్తులను ఇప్పటి వరకు ప్రభుత్వం గుర్తించలేదని ఆయన అన్నారు. దోషులు ఎవరు అని నేను అడగాలనుకుంటున్నాను? వారికి ఎందుకు న్యాయం జరగలేదు? నిఘా వైఫల్యాలు ఎందుకు జరుగుతున్నాయి? మరోసారి సైనికులు ప్రాణాలు కోల్పోయారు. నా ఉద్దేశ్యం ఏమిటంటే, దీన్ని బిజెపి ఎందుకు రాజకీయ స్టంట్‌గా చేస్తోంది? అని ప్రశ్నించారు.