ఏపీ సర్కారుపై BJP చీఫ్ పురందేశ్వరి తీవ్ర ఆరోపణలు
ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందేశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీ లిక్కర్ స్కాం జరుగుతోందని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం నాణ్యత లేని మద్యంతో మహిళల పుస్తెలను తెంపుతోందని విమర్శించారు. మద్యం అమ్మకాల్లో 25 శాతానికి బిల్లులే ఉండడం లేదని, ఇసుక లోడ్ కొనాలంటే 40వేలని, ఇసుక మాఫీయాను రాష్ట్రంలో అరికట్టాలని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి 9 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం 20వేల కోట్లు ఇచ్చిందని, అయితే రాష్ట్రంలో ఇప్పటివరకూ ఇళ్లు పూర్తికాలేదని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు కేంద్రానికి అప్పగించాాలి
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం రూ. 40-50 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని, ప్రాజెక్టు నిర్మాణం ఏపీ ప్రభుత్వం వల్ల కాకపోతే కేంద్రానికి అప్పగించాలని పురంధేశ్వరి సలహా ఇచ్చారు. మహిళలకు రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందని, దిశా యాప్ ఎందుకు పనికిరావడం లేదని, విశాఖలో ఎంపీ కుటుంబానికే రక్షణ కరువైందన్నారు. ఏపీలో 8623 కిలోమీటర్ల నిర్మాణాలకు రూ.1 లక్షా 15 వేల కోట్లు కేంద్రం కేటాయించిందని, కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రహదారులు వేసిందో సమాధానం చెప్పాలని ఆమె ప్రశ్నించారు. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధికి కేంద్రం నేరుగా సర్పంచ్‌ల అకౌంట్‌లలోకి నిధులు విడుదల చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టిస్తోందన్నారు.