Kangana Ranaut: వ్యవసాయ చట్టాలపై వ్యాఖ్యల వివాదం.. అవి తన వ్యక్తిగతమని స్పష్టం
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ అమలు చేయాలని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కంగనా, మంగళవారం తన నియోజకవర్గం మండిలో మీడియాతో మాట్లాడేటప్పుడు, "నాకు తెలుసు ఇది వివాదాస్పదం అవుతుంది. కానీ రద్దు చేసిన మూడు సాగు చట్టాలను మళ్లీ అమల్లోకి తీసుకురావాలి. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే ఆ చట్టాలను తిరిగి అమలుచేయాలి. దేశాభివృద్ధికి రైతులు వెన్నెముకగా ఉంటారు. అందుకే రైతులు తమ శ్రేయస్సుకు ఉపయోగకరమైన ఆ చట్టాల కోసం డిమాండ్ చేయాలి" అని తెలిపింది.
బీజేపీ ఈ వ్యాఖ్యలపై దూరంగా ఉండాలని నిర్ణయించింది
ఈ వ్యాఖ్యలతో ఆమె తీవ్ర విమర్శలపాలైంది . అయితే, బీజేపీ ఈ వ్యాఖ్యలపై దూరంగా ఉండాలని నిర్ణయించింది. తాము వాటిని ఖండిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఓ ప్రకటనలో వెల్లడించారు. "అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీగా ఈ విషయంపై ఆమెకు ఎలాంటి అధికారం లేదు" అన్నారు. ఈ క్రమంలో, కంగనా 'ఎక్స్' వేదికపై స్పందిస్తూ, ఈ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమేనని, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. గతంలో,సాగు చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు నిర్వహించిన ఉద్యమం తీవ్ర స్థాయిలో కొనసాగింది. దిల్లీ సరిహద్దుల్లో దాదాపు ఏడాది పాటు వారు నిరసనలు చేపట్టారు.2021 నవంబరులో కేంద్రం, ప్రధాని మోదీ నేతృత్వంలో,మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
బీజేపీ విభేదించడం ఇది రెండవసారి
కాగా.. కంగనా వ్యాఖ్యలు బీజేపీ విభేదించడం ఇది రెండవసారి. ఇటీవల ఆమె రైతుల నిరసనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో, పార్టీ ఆమెను మందలించింది. ఆమెకు పార్టీ విధానంపై మాట్లాడే అధికారం లేదని స్పష్టం చేసింది.