రెండో రోజూ దిల్లీలోనే ఈటల.. ఏ క్షణంలోనా కీలక ప్రకటన వచ్చే అవకాశం
భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శుక్రవారం హుటాహుటిన దిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పార్టీ అగ్రనేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. అయితే రెండో రోజైన శనివారం సైతం ఈటల దిల్లీలోనే మకాం వేశారు. ఏ క్షణంలోనైనా పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక మార్పులు చేర్పులకు పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. పార్టీలో కీలక నేత ఈటల రాజేందర్‌కు ప్రచార సారథి పదవిని అప్పగించేందుకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తైనట్లు సమాచారం.
'ప్రచార కమిటీ ఛైర్మన్' ఈటల అంటూ ప్రచారం
ఇప్పటికే ఈటల చేరికల కమిటీ రథసారిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు సన్నద్ధం అయ్యే క్రమంలోనే రాజేందర్‌కు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈనెల 15న హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పార్టీలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోవచ్చని సమాచారం. తెలంగాణకు సంబంధించి గతంలోనే భాజపా బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. రాబోయే శాసనసభ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ నాయకుడికే కమలదళంలో ఎక్కువ అవకాశాలున్నాయి. మరోవైపు జాతీయ అగ్రనేతలు వరుసగా అమిత్ షా, జేపీ నడ్డా ఈ నెలలోనే రాష్ట్రానికి క్యూ కట్టనున్నారు. అనుకున్నట్టుగా జరిగితే నెలఖారులో ప్రధాని మోదీ సైతం భాగ్యనగరంలో రోడ్ షో చేయనున్నారు.