Page Loader
ఈటలకు అధిష్ఠానం పిలుపు.. కీలక పదవి అప్పగించే అవకాశం
ఈటలకు అధిష్ఠానం పిలుపు.. కీలక పదవి అప్పగించే అవకాశం

ఈటలకు అధిష్ఠానం పిలుపు.. కీలక పదవి అప్పగించే అవకాశం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 09, 2023
06:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ గడ్డపై ఎలాగైనా కాషాయ జెండా రెపరెపలాడించాలన్నది భారతీయ జనతా పార్టీ జాతీయ నేతల లక్ష్యం. ఇందుకోసం అగ్రనేతలు తెలంగాణలో వరుస పర్యటనలు చేయనున్నారు. అసలే ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలోని చిన్నచిన్న సమస్యలు, సమన్వయ లోపం, అభిప్రాయ బేధాలకు స్వస్తి పలకాలని పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు పార్టీ బలోపేతానికి ఈటల రాజేందర్ సేవల్ని మరింత సమర్థంగా ఉపయోగించుకునే క్రమంలో మరో కీలకమైన పదవి బాధ్యతలు ఆయనకు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటలకు మరో పెద్ద పదవి రానుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

DETAILS

రాష్ట్ర భాజపా పరిస్థితులపై దిల్లీలో చర్చ జరిగే అవకాశం 

అధిష్ఠానం పిలుపు మేరకు హుటాహుటిన దిల్లీ వెళ్లిన ఈటలకు, ప్రచార కమిటీని ఏర్పాటు చేసి దాని బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు కాషాయ కండువా కప్పడంలో చేరికల కమిటీ పూర్తిగా తేలిపోయిందనే విమర్శలు ఉన్నాయి. తాజాగా పొంగులేటి, జూపల్లి వంటి బడా నేతలను కలిసి భాజపాలోకి ఆహ్వానించేందుకు ఈటల చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వలేదనే విషయం అర్థమవుతోంది. మరోవైపు కర్ణాటక ఫలితాల తర్వాత వేరే పార్టీల నుంచి భాజపాలో చేరిన వారు దిక్కులు చూస్తున్నారనే మాట వినిపిస్తోంది. వీటన్నింటి పరిష్కారం వెతికే నేపథ్యంలోనే ఉన్నఫలంగా దిల్లీకి రమ్మని ఈటలకు అధిష్ఠానం కబురు పంపినట్లు సమాచారం.