ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం.. నడిరోడ్డుపై బీజేపీ నేతను కాల్చి చంపిన ప్రత్యర్థులు
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. సంభాల్ కు చెందిన బీజేపీ నేతను పాశవికంగా హత్య చేశారు. గురువారం సాయంత్రం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి కాల్పులు జరిపారు. ఆకస్మాత్తుగా జరిపిన కాల్పుల్లో అనుజ్ చౌదరి అక్కడికక్కడే ప్రాణం విడిచారు. 34 ఏళ్ల భారతీయ జనతా పార్టీ నేత మొరదాబాద్ లోని తన అపార్ట్‌మెంట్ వద్ద ఓ వ్యక్తితో కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే బైక్ పై వెనుక నుంచి వేగంగా వచ్చిన ముగ్గురు దుండగులు ఆయనపై పాశవికంగా కాల్పులు జరిపారు. దీంతో బాధితుడు కుప్పకూలిపోయాడు. చౌదరితో కలిసి నడుస్తున్న వ్యక్తి వెంటనే ప్రాణభయంతో పరుగు లంకించుకున్నాడు.
కుటుంబ సభ్యులపైనే అనుమానాలు
ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాలుపంచుకున్నారు. కాగా అందులో ఇద్దరు వాహనం దిగి చౌదరిపై వరుసగా కాల్పులు చేశారు. మరో వ్యక్తి వాహనాన్ని నడిపిస్తుండటం గమనార్హం. కాల్పుల మోతతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతన్న అనుజ్ చౌదరిని స్థానికులు హుటాహుటిన మొరదాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చౌదరి కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. హత్య కేసులో కుటుంబీకులు అమిత్ చౌదరి, అనికేత్‌లపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులే ఈ ఘోరానికి ఒడిగట్టారని చౌదరి కుటుంబం అంటోంది. హత్యకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.