Page Loader
Delhi: దిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ కీలక నిర్ణయం.. ప్రమాణస్వీకార తేదీ ఫిక్స్!
దిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ కీలక నిర్ణయం.. ప్రమాణస్వీకార తేదీ ఫిక్స్!

Delhi: దిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ కీలక నిర్ణయం.. ప్రమాణస్వీకార తేదీ ఫిక్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 09, 2025
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపికవుతారు? ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరుగుతుంది? అనే అంశాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీ నాయకులతో చర్చించేందుకు బీజేపీ సిద్ధమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ, 70 అసెంబ్లీ స్థానాల్లో 48 చోట్ల విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కీలక నేతలు, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆదివారం భేటీ కానున్నట్లు సమాచారం.

Details

ముఖ్యమంత్రి రేసులో పర్వేశ్ వర్మ

శనివారం ఫలితాలు వెలువడిన అనంతరం, ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిగినట్లు పలు ఆంగ్ల మీడియా సంస్థలు వెల్లడించాయి. దిల్లీ సీఎం పదవికి మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే, మాజీ బీజేపీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్, దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ, జాతీయ కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, ఎంపీ బన్సూరీ స్వరాజ్ పేర్లు కూడా సీఎం రేసులో ఉన్నాయి. బన్సూరీ స్వరాజ్, దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె, గతేడాదే న్యూదిల్లీలోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే పార్టీ అధిష్టానం చివరకు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Details

ఈనెల 10న అమెరికా పర్యటనకు వెళ్లనున్న నరేంద్ర మోదీ

ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10 నుంచి ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలు ముగిసిన అనంతరం ప్రమాణ స్వీకారం జరిగే అవకాశముందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేవలం 22 స్థానాలకు పరిమితమైంది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు అగ్రనేతలు మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ ఓటమిపాలవ్వగా, సీఎం అభ్యర్థిగా పోటీ చేసిన ఆతిశీ మాత్రం కాల్కాజీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.